"తిరుమల భద్రతపై కేంద్ర సమీక్షను అందుకే వద్దన్నారు"

తిరుపతి: పవిత్రమైన తిరుమలలో జరుగుతున్న అనాచారాలపై కేంద్రం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో తిరుపతిలో తొక్కిసలాట, తిరుమలలో అగ్నిప్రమాదం, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న వ్యవహారాలపై కేంద్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ నుంచి సమీక్షకు ఉన్నతాధికారుల బృందం రానున్నదని తెలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భయపడ్డారని అన్నారు. దీనిని అడ్డుకునేందుకు విజయవాడకు వచ్చిన అమిత్ షా కాళ్ళావేళ్ళా పడి ఈ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారని ఆరోపించారు. 


Published on: 19 Jan 2025 17:09  IST

తిరుపతిలో జరిగిన ఘటనలపై కేంద్రం విచారణకు, సమీక్షకు ఆదేశించింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి అవమానం. వెంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రం చాలా సీరియస్ గా స్పందించింది. వెంటనే దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నిన్న అమిత్ షా విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన ముందు సాగిలపడి, ప్రాదేయపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్లుగా మరో ప్రకటన చేయించుకున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రం నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో వ్యత్యాసాలు ఎందుకు...

మొదట ఒక సీనియర్ అధికారి నుంచి తిరుమల వ్యవహారాల్లో సమీక్షకు అధికారుల బృదంను పంపుతున్నామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. రాత్రికి రాత్రే ఎటువంటి అధికారిక సంతకాలు లేకుండానే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ నుంచి కంట్రోల్ రూం ఆఫీసర్ పేరుతో రెండోసారి ఆదేశాలు వచ్చాయి. మొదట వచ్చిన సమీక్ష ఆదేశాలను అషీశ్ వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంతకంతో మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ ను సమీక్షకు పంపుతున్నామని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న అపచారాలకు, దుర్ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో అధికారికంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 17వ తేదీన ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దానిపై వెంటనే నిన్న అమిత్ షా రాగానే చంద్రబాబు, ఆయన బృందం ఆయన ముందు మొరపెట్టుకుని రాత్రి పొద్దుపోయిన తరువాత కంట్రోల్ రూం ఆఫీస్ నుంచి ఈ రకమైన ప్రకటనను విడుదల చేయించుకున్నారు. అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడో అర్థమవుతోంది. నిజాలు ఎప్పటికీ బయటకు రానివ్వకుండా, శాశ్వతంగా సమాధి చేసే పనులు చేస్తున్నారు. ఈ అపచారాలకు శ్రీవారే శిక్షిస్తారు. దర్శనంకు వచ్చేందుకే ఒక అధికారి ఇలా ఆదేశాలు జారీ చేశారంటే తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రిక రాసింది. కేంద్ర సర్వీసులకు చెందిన ఉన్నతాధికారి దర్శనం కోసం రావాలంటే, అందుకు సమీక్షా సమావేశంను అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కేంద్రం జోక్యం చేసుకుందనే వాస్తవాన్ని వక్రీకరించడం కాదా?

- తిరుమలపై కేంద్రం జోక్యం ఇదే మొదటిసారి

మొదటి సారి కేంద్రప్రభుత్వం తిరుమలలో జరుగుతున్న దుష్టాంతాలపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. ఆనాడు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి కార్యదర్శి నుంచి ఈ రాష్ట్రంలోని ఇద్దరికే ఆహ్వానం వచ్చింది. టీటీడీ చైర్మన్ హోదాలో ఆ ఆహ్వానం మేరకు నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక కార్యదర్శి టీటీడీ చైర్మన్ గా నాకు, ఆనాడు ఈఓగా ఉన్న ధర్మారెడ్డికి ఫోన్ చేసి క్రౌడ్ మేనేజ్ మెంట్ పై మీ అధికారునలు అయోధ్యకు పంపాలని కోరారు. ఈ మేరకు టీటీడీ నుంచి అధికారుల బృందం అయోధ్యకు వెళ్ళి సమర్థవంతంగా పదిరోజుల పాటు పనిచేసి, అక్కడి వారికి సలహాలు సూచనలు చేశారు. ఆ కార్యక్రమాన్ని సమర్థంగా జరిగేందుకు పూర్తిగా సహకరించారు. అటువంటి చరిత్ర ఉన్న టీటీడీకి కూటమి ప్రభుత్వం నేడు తన అసమర్థతతో అప్రదిష్టను తెచ్చిపెట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆనంద నిలయం చెంత అన్నీ అపచారాలే. ఇది దైవద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. తప్పుడు వాగ్ధానాలు, మాయ మాటలతో మనుషులను మోసం చేస్తున్న చంద్రబాబు, అదే విధంగా శ్రీవారి ముందు కూడా వ్యవహరించాలను కోవడం సాధ్యం కాదు. ధార్మిక రాజధానిలో శిశుమరణాలు, కొండమీది చౌల్ట్రీ నుంచి ఒక బాలుడు కిందపడి చనిపోయాడు. మద్యం, మాంసాలు కొండమీదికి నిరంతరంగా సరఫరా అవుతున్నాయి. నిన్ననే తిరుమల కొండపై బిర్యాని తింటున్న ఘటనను భక్తులే గుర్తించి విజిలెన్స్ కు సమాచారం అందించారు. ఇటువంటి ఘటనలపై చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడు. అందువల్లే తిరుమలలో ఇటువంటి అనాచారాలు జరుగుతున్నాయి. 

- తిరుపతి తొక్కిసాలటపై నేటికీ జ్యుడీషియల్ విచారణ ఆదేశాలు ఇవ్వలేదు

వైకుంఠ ఏకాదశి కోసం వచ్చిన భక్తులకు సరైన ఏర్పాటు చేయకుండా, పదిగంటల పాటు ఒక పార్క్ లో బయటకు రానివ్వకుండా ఉంచారు. ఒక్కసారిగా వారిని క్యూలైన్లలోకి వదిలి, ఆరుగురు మృతి చెందేందుకు కారణమయ్యారు. విష్ణునివాసం వద్ద జరిగిన తొక్కిసాలటలో మరొకరు మృతి చెందారు. దీనికి చంద్రబాబు బాధ్యత తీసుకోవాలి. నామమాత్రంగా సమీక్ష చేసి, దీనికి ప్రధాన కారణమైన ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్ పై చర్యలు తీసుకోకుండా, ఎస్సీని బదిలీ చేయడం, కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. బీఆర్ నాయకుడు ఒక చానెల్ నడుపుతున్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆలయ నిర్వహణ, సామాజిక బాధ్యత, భక్తుల సేవ పట్ల చిత్తశుద్ది, సంప్రదాయాల పట్ల గౌరవం లేని వ్యక్తులకు ఇటువంటి బాధ్యతలు అప్పగించారు. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి స్వామి వారి కన్నా చంద్రబాబు, లోకేష్ సేవలకే పరిమితమయ్యారు. వారు సిఫారస్ చేసిన వారికి వీఐపీ దర్శనాలు చేయించడమే ఆయన పని. వైకుంఠ ఏకాదశికి సంబంధించి మూడు సార్లు పుష్పాలంకరణ చేస్తారు. కర్ణాటకకు చెందిన సునీత గౌడ అనే భక్తురాలు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేసి పుష్పాలంకరణ చేస్తే తీసిపారేశారు. దీనిపై ఆమె ఆలయం ముందే కన్నీరు పెట్టారు. దీనిపై అడిషనల్ ఈఓ చాలా చిన్న సంఘటనగా దీనిని కొట్టిపారేశారు. 

- తిరుమలపై ఎర్రచందనం స్మగ్లింగ్

 తిరుమలో నాలుగు సార్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సనాతనధర్మ పరిరక్షకుడుగా చెప్పుకుంటున్న అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ దీనికి బాధ్యత వహించాలి. ఇంత ధైర్మంగా స్మగ్లింగ్ జరుగుతోందంటే దానికి మీ వైఫల్యం కారణం కాదా? మిమ్మల్ని చూసుకునే, ధైర్యంతో మీకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇలాంటి పనులు  చేస్తున్నారా? వైకుంట ఏకాదశి సందర్భంగా ఆరుగురు చనిపోయిన దుర్ఘటనపై వాళ్ళ బంధువులు ఆనందపడుతున్నారు, వెంకటేశ్వరస్వామి వారిని తీసుకువెళ్లారని ప్రకటనలు చేయడం దారుణం కాదా? ఆనాడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సిట్ విచారణ జరుపుతున్నారు. ఏదీ దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి వాస్తవాలను ఎందుకు వెల్లడించలేదు? తిరుమల తొక్కిసలాటపై న్యాయవిచారణ జరుపుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకు దానిపై ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? తిరుమలలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. కూటమి పార్టీలకు చెందిన వారు టిక్కెట్లు అమ్మకుంటూ తమ కోసం సంపదను సృష్టించుకుంటున్నారు. స్వామివారి మాడవీదుల్లో ఉద్యోగులే చెప్పులు వేసుకుని తిరుగుతూ పట్టుబడ్డారు. అంటే మీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీటీడీలో అధికారుల మధ్యే సమన్వయం లేదు. భయం, భక్తీ లేకుండా కేవలం చంద్రబాబు మీద భక్తి చూపితే చాలనే విధంగా తయారయ్యింది. దీనిని వైయస్ఆర్ సీపీ ఖండిస్తోంది. చంద్రబాబు రూ.25 లక్షల పరిహారం ప్రకటిస్తే, దానిని ప్రభుత్వానికి బదులు, టీటీడీ నుంచి ఇప్పించారు. ఇదేనా చంద్రబాబు చిత్తశుద్ది అని కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.


 

Source From: రాజాజీ