ఏపీలో పేదలకు పంపిణీ చేసిన స్థలాలు రద్దు...!!

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళస్థలాలను రద్దు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. పెద్ద ఎత్తున పేదలకు పంపిణీ చేసిన స్థలాలను ప్రభుత్వం గుంజుకుంటోందని, వాటిని తమ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా తమ కార్యకర్తలకు కట్టబెట్టేందుకు పెద్ద కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల సెంటు స్థలాన్ని కూడా ప్రభుత్వం తిరిగి తీసేసుకుని, వాటిని రెండు, మూడు సెంట్లుగా కలుపుకుని తమకు కావాల్సిన వారికి తిరిగి పంపిణీ చేస్తుందని అన్నారు.


Published on: 18 Jan 2025 15:40  IST

తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర  మంత్రివర్గం సమావేశం అయితే చాలు రాష్ట్రంలో ప్రజలు భీతిల్లి పోతున్నారు. ఎటువైపు నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుని తమ బతుకులను ఛిద్రం చేస్తారేమెనన్న భయం వారిని వెంటాడుతోంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుగారు, ఆయన కూటమి ప్రభుత్వం పేదల ఉసురు తీసుకుంటోంది. తన జీవితకాలంలో చంద్రబాబు తన పరిపాలనా కాలంలో ఎప్పుడకూడా ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదు. తను ఇవ్వలేదు సరికదా? వైయస్.జగన్మోహన్రెడ్డిగారి హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తిరిగి తన కార్యకర్తలకు తాయిలాలు కింద ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వైయస్సార్సీపీ హయాంలో అర్హత ఉన్న ఏ పేదవాడు కూడా ఇల్లు లేదనే మాట రాకూడదు, ఇంటి స్థలం లేదనే మాట వినిపించకూడదన్న ఒక సంకల్పం పూని, అకుంఠత దీక్ష చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలకు 30.6లక్షల ఇళ్లపట్టాలను వారి పేరు మీదే కేవలం ఒకే ఒక్క రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. 71,811 ఎకరాలను పేదలకు ఇళ్లస్థలాల రూపంలో వైయస్ జగన్  ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ భూమి, రెగ్యులైజేషన్ చేసిన భూమి కాకుండా కేవలం భూమిని కొనుగోలు చేసి కూడా పేదలకు పంపిణీచేశారు. రూ.15,364.5 కోట్లు ఖర్చుచేసి వేలాది ఎకరాల భూమిని సేకరించి… పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఈ పంపిణీ చేసిన ఇళ్లపట్టాల విలువ ఒక్కో చోట రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. ఇంటిపట్టా కనీస విలువ రూ.2.5లక్షలు వేసుకున్నా పేదలకు పంపిణీ చేసిన మొత్తం విలువ అక్షరాల రూ.75000 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో రేట్లను పరిగణలోకి తీసుకుంటే రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను వారి చేతిలో మా ప్రభుత్వం పెట్టింది. భారీ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైయస్ఆర్ జగనన్న కాలనీలు ఏర్పడ్డాయి. 

ఇళ్లపట్టాలు అందుకున్న వారిలో 20శాతం ఎస్సీలు కాగా, ఎస్టీలు 6శాతం ఉన్నారు. బీసీ వర్గాలకు చెందినవారు 54 శాతం కాగా, ఇతరులు 21శాతం ఉన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్లనిర్మాణాల కార్యక్రమంలో సామాజిక న్యాయానికి నిదర్శనం ఇది. మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలకే ప్రతి లబ్ధిదారునికి 4.5 మెట్రిక్ టన్నుల సిమ్మెంటు, 0.48 మెట్రిక్ టన్నుల స్టీలు అందించింది. దీంతోపాటు డోర్లు, కిటికీ ఫ్రేములు, షట్టర్లు, ఎలక్ట్రిక్ శానిటరీ సామాన్లు ఇలా 12 రకాల సామాన్లను తక్కవు ధరకే అందించింది. కాలనీల్లోనే తాత్కాలిక గోడౌన్లను ఏర్పాటు చేసి, ఈ సామగ్రిని అంతా అక్కడే ఉంచి లబ్ధిదారులకు అందిస్తోంది. ఈ రూపేణా రూ.40వేల రూపాయల అదనపు సహాయాన్ని అందించింది. దీంతోపాటు 20 టన్నుల చొప్పున ఉచితంగా ఇసుకను ప్రతి లబ్ధిదారునికీ ఇచ్చింది. తద్వారా మరో రూ.15వేల రూపాయల మేర ప్రతి లబ్ధిదారునకూ మేలు చేకూర్చింది. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అంటే తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్, ఆర్చెస్, సోక్ పిట్స్ సహా మౌలిక సదుపాయాలకోసం రూ.35,859 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక తయారుచేసింది. ఎన్నికల సమయం నాటికి దాదాపుగా 11 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావన్నీ కూడా నిర్మాణదశలో ఉన్నాయి. మరికొందరు వివిద కారణాల వల్ల నిర్మాణాలు చేసుకోలేదు. ఇప్పుడు వీరందరిమీదా చంద్రబాబు నాయుడు గుదిబండ వేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఎప్పుడు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్లనిర్మాణాల సంగతి, లబ్ధిదారుల బాగోగుల సంగతి పట్టించుకోలేదు. ప్రతి దశలోనూ కూడా రాజకీయ కక్ష చూపారు. కాలనీల్లో జగన్ పేరును తీసేయడానికి యత్నించారు తప్ప జగన్ లాగా పేదలకు చేదోడుగా నిలిచేందుకు ఏరోజూ ప్రయత్నించలేదు. పైగా తప్పుడు ఆరోపణలతో కాలయాపనచేసి ఇళ్లనిర్మాణాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పారదర్శకంగా ఇళ్లస్థలాలు సంపాదించిన అర్హుల వద్దనుంచి విలువైన స్థలాలను లాక్కుని వారిని తమ కార్యకర్తలకు పలహారాలుగా ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబుకు మంచి చేయాలని ఉద్దేశం ఉంటే.. ఒకరికి ఇచ్చిన ఇళ్లస్థలాలు లాక్కోవడం ఏంటి? పేదల పొట్ట కొడ్డం ఏంటి? మీకు చేతనైతే జగన్గార రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టి భూమి సేకరించి ఇళ్లస్థలాలు ఇచ్చారు. మీరుకూడా డబ్బు ఖర్చుచేసి భూమిని కొనుగోలుచేసి, వాటిని డెవలప్చేసి.. ఇళ్లపట్టాలు ఇవ్వండి. ఎవరు వద్దంటారు. అంతేకాని… ఇదివరకే ఇచ్చిన వారి నుంచి లాక్కోవడం ఏంటి? 

అలాగే ఫ్రీహోల్డ్ చేసిన భూముల వ్యవహారంలోనూ కూడా చంద్రబాబు రాజకీయంచేయాలని చూస్తున్నారు. ఇది పేద రైతులను తీవ్రంగా ఇబ్బందిపెట్టడమే. రైతులకు సంబంధించిన భూములను లాక్కుని మీ మనుషులకు, కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్న పన్నాగం ఇది.  రైతుల వ్యవహారాల్లో రాజకీయ కక్షలను చొప్పిస్తే.. దాని ఫలితాలను చంద్రబాబునాయుడు అనుభవించాల్సి వస్తుంది. అసైన్డ్ భూముల, ఇతరత్రా కేటగిరీల భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ విషయంలో నానా ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటికొచ్చి అక్రమాలను జరిగాయని తేల్చలేకపోయారు. మీరు  చేస్తున్న ఆరోపణలన్నీ మీరు సృష్టించిన వివాదాలే తప్ప, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని మీ అధికారులే చెప్పారు. కాని, ఏదోరకంగా మీరు అనుకున్నది చేయడానికి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఇది చేస్తే రైతులకు మీరు తీవ్రంగా అన్యాయం చేసినట్టే. నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. 2014-19లో  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు చేసిన అన్యాయం అంతాఇంతాకాదు. పేదల భూములను వారు కొట్టేయలేదా? రాజధాని అని పేరుచెప్పి అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1100 ఎకరాలు కొట్టేశారు. అసైన్డ్ దారుల చేసితో భూములు ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని ఒక పథకం ప్రకారం ప్రచారం చేసి లాగేసుకుని ఆతర్వాత జీవో ఇచ్చి, వాటిని పప్పుబెల్లాల మాదిరి రేట్లకు కొనుగోలుచేసి, చేతులు మారినన తర్వాత అవే  భూములను పూలింగ్లోకి తీసుకుని.. ప్లాట్లు కేటాయించుకుని, వాటిని తిరిగి అమ్ముకుని కోట్లు కొల్లగొట్టారు. 1336 మంది బినామీలు ఇలా ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోంది… మరి ఇవి  అక్రమాలు కాదంటారా? ఆకేసులను కూడా ఇప్పుడు నీరుగార్చడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారులను ఒత్తిడికి గురిచేసి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు  అవినీతి ఊబిలో చిక్కుకుపోయారు కాబట్టి.. మిగతా వారిమీద బురదజల్లి ప్రజలను పక్కదోవ పట్టించి.. కాల గడుపుకునే పద్ధితిలో ఇప్పుడు అసైన్డ్ వ్యవహారాన్ని మారుస్తున్నారు. 

అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. ఈ భూములు ఉన్న పేదలు, రైతులు అందరూ దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నా… కష్టం వస్తే.. దాన్ని ఏదో ఒకటి చేసుకుందామనుకున్నా.. చేసుకోలేని పరిస్థితి. చివరకు పైసాకో, పరక్కో ఏదొక కాగితంమీద రాసిచ్చి ఎంతో కొంత డబ్బుకు తెగనమ్ముకునే పరిస్థితి. ఈ పరిస్థితులు క్షేత్రస్థాయిలో లేవంటారా? రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే.. సంవత్సరాల తరబడి మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం.. అమ్ముకుంటే, దాన్ని కొనుక్కున్నవాడికీ కంటిమీద కునుకులేని పరిస్థితి. క్షేత్రస్థాయలో ఇవి వాస్తవాలు కావా.     అందుకే పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి   ప్రభుత్వం అసైన్డ్ చట్టానికి సవరణలు చేసింది. గత ఏడాది అక్టోబరు 27న దీనికి సంబంధించిన గెజిట్ జారీ అయ్యింది. చట్టానికి సరవణలు చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఎక్కడా అవినీతి లేదా ఒరిజనల్ అసైన్డ్ దారులకు ఎలాంటి నష్టం రాకుండా పగడ్బందీగా చేశారు. అనేకమంది సీనియర్ అధికారులు, న్యాయనిపుణులు, సీనియర్లు అంతా కలిసి కూర్చుని చక్కటి నిర్ణయాలు తీసుకుని చట్టానికి సవరణలు చేశారు. ఒరిజనల్ అసైనీలకు మాత్రమే న్యాయబద్ధంగా, తమ ఇష్టపూర్వకంగా అవసరానికి అమ్ముకునే హక్కును కల్పించారు. ఒకవేళ ఇప్పటికే చేతులు మారిన సందర్భాల్లోకూడా, కొనుక్కున్నవారికి కాకుండా ఒరిజనల్ అసైన్డ్ దారులకు మాత్రమే పూర్తి హక్కలు వచ్చేలా ఈ చట్టం పూర్తిగా పేదలకు అండగా నిలిచింది. మరి ఇలాంటి సందర్భాల్లో కుంభకోణాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది.  ఈ చట్టం చేస్తున్న సమయంలో చాలామంది చాలా రకాల ఒత్తిళ్లు తెచ్చారు. అస్సైన్ దారులనుంచి కొనుగోలుచేసి 20 సంవత్సరాలు పూర్తైయిన వారికి లేదా 10 సంవత్సరాల పూర్తైన వారికి సర్వహక్కులు కల్పించేలా సవరణల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేసినా.. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డిగారు ససేమిరా అన్నారు. ఇది చేస్తే.. మొత్తం ఉద్దేశం నీరుగారిపోయే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒరిజనల్ అసైన్డ్దారులకు తప్ప… వేరొకరికరి అవకాశం ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం ఇన్న జాగ్రత్తలు తీసుకుంది. ఈ రకంగా దాదాపు 9లక్షల ఎకరాలను 22-ఏ నుంచి తొలగించారు. నిజంగా ఎవరోఒకరికి లబ్ధిచేకూర్చాలనుకుంటే.. ఎవరి ఆధీనంలో భూమి ఉంటే  వారికి చేయండి అని చెప్పేవారు. కాని అలా జరగలేదే. ఏ పేదవాడు అయితే లబ్ధిదారో, ఒరిజనల్ అస్సైనీ ఎవరో, వారు లేకపోతే వారసులు ఎవరున్నారో వారికే సర్వహక్కులూ ఇవ్వమన్నారు. ఇందులో తప్పు ఏముంది? ఇప్పుడు వీరందర్నీ రోడ్డుకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్టకొట్టాలని చూస్తున్నారా? రిజిస్ట్రేషన్లు నిలిపేయమని, ఫ్రీహోల్డ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చి… ఇప్పుడు టీడీపీ వాళ్లు ఏంచేస్తున్నారంటే.. ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయో అక్కడ వాలిపోయారు. రూపాయి భూమిని ఇప్పుడు పదిపైసలకు, పావలాకు అడుగుతున్నారు. లేదంటే.. ప్రభుత్వం మాది, మీకు హక్కులు ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు పంచేసుకుని.. వారి ముఠాలను రంగంలోకి దించి ఇప్పుడు వసూళ్లకు దిగారు.

 చట్ట సవరణల ద్వారా లబ్ధి పొందిన పేదలను కూడా బెదిరించి.. వారిని లొంగదీసుకుని ఆ భూ వ్యవహారాలను తిరిగి తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంచేస్తున్నారు. మొత్తంగా పేదలు, అసైన్డ్దారుల పొట్టకొడుతున్నారు. నిజానికి అసైన్డ్ భూములు కానీ, చుక్కల భూములు కానీ, షరతు గల పట్టాల భూములు కానీ.. రైతులు నానా ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో, వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాతే వారికి మేలు జరిగింది. ౨౭.౪౦  లక్షల ఎకరాలకు సంబంధించి ౧౫.౨ లక్షల మంది రైతులకు మేలుచేసింది. ఇప్పుడు వీరందర్నీ రోడ్డుమీదకు లాగేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. అలాగే పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థనుకూడా నీరుగారుస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులను దాదాపుగా సగానికి తగ్గిస్తున్నారు. ఇప్పటివకే వాలంటీర్లను రోడ్డున పడేశారు. దీనివల్ల ప్రజలకు ఇంటివద్దకే సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మళ్లీ మధ్యవర్తులు, రాజకీయ దళాలరు కాలం వచ్చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో జగన్గారు దాదాపు 1.5 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే, వాటి సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. తాజా నిర్ణయం వల్ల 35 వేల పోస్టులు పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు భవిష్యత్తులో చోటుచేసుకోబోతున్నాయి. ఇది నిరుద్యోగులను, గ్రామాల్లో పాలనను దెబ్బకొట్టడమే. 

Source From: రాజాజీ