"లోకేష్ కు డిప్యూటీ సీఎంకు అమిత్ షా నో...!!"

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు క్విడ్ ప్రో కో కింద కాజేసిన కరకట్ట అక్రమ నిర్మాణంలో చంద్రబాబు విందు ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విందు సందర్భంగా తన కుమారుడు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రాదేయపడ్డారని అన్నారు. దీనిపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేస్తూ నారా లోకేష్ అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటూ చేస్తున్న వసూళ్ళ వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మందలించారని తెలిపారు. అంతేకాకుండా లోకేష్ ను అదుపులో పెట్టుకోవాలని కూడా చంద్రబాబుకు అమిత్ షా హితవు చెప్పారని అన్నారు. ఇవ్వన్నీ బయటకు రాకుండా ఉండేందుకు ఈ విందులో వైయస్ జగన్ నివాసాలపై చర్చ జరిగినట్లు తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో అబద్దపు కథనాలను రాయించారని ధ్వజమెత్తారు.


Published on: 19 Jan 2025 16:43  IST

 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన అనేక సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ సమస్యలపై ఆయనకు సీఎం చంద్రబాబు వివరిస్తారని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని అందరూ ఆశించారు. కృష్ణాజలాల సమస్య నేటికీ అపరిష్కృతంగా ఉంది. వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కేంద్రం నుంచి తక్షణం వాటిని ఇవ్వాలని ఆదేశాలు తీసుకురాగలిగారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వత పరిష్కారం కోసం చర్చించాల్సిన అవసరం ఉంది. అమిత్ షా మన రాష్ట్రం వచ్చినప్పుడు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన తరుణంలో కూటమి నేతలు వాటి కోసం కృషి చేస్తారని అందరూ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా వైయస్ జగన్ గారి నివాసాలపై అమిత్ షా తో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లు పోటీ పడి మరీ కూలంకశంగా వివరించినట్లు తెలుగుదేశంకు వంతపాడే ఎల్లో మీడియాలోనే పెద్ద కథనాలు వచ్చాయి. ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం వున్న వారైనా ఒక హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ సీఎంకు చెందిన నివాసాల గురించి అడిగి, వాటిపై చర్చించేందుకు ఆసక్తి చూపుతారంటే నమ్ముతారా? అమిత్ షా విందులో జరిగింది ఒకటైతే, దానిని బయటకు రానివ్వకుండా వైయస్ జగన్ గారి నివాసాలపై చర్చ అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వత్తిడి చేయడం వల్లే చంద్రబాబు అంగీకరించాడు. ఇప్పుడు తన కుమారుడికి కూడా డిప్యూటీ సీఎం కావాలని, ఇందుకోసం తన నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేసి, తన మనస్సులోని కోరికను ఆయన ముందు వ్యక్తం చేశాడని మాకు సమాచారం ఉంది. ఇందుకు అమిత్ షా నుంచి విముఖత రావడంతో ఎక్కడ ఇది బయటకు వస్తే, తనకు జరిగిన అవమానం అందరికీ తెలుస్తుందోననే భయంతోనే ఎల్లో మీడియాలో వైయస్ జగన్ నివాసాల గురించి అభూత కల్పనలతో కూడిన కథనాలను రాయించారు. 

- నాడు రాళ్ళ వర్షం... నేడు పూలవర్షం...

తాజాగా అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా చంద్రబాబు ఆయనపై పూలవర్షం కురిపించాడు. గతంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అమిత్ షా కేంద్ర హోంమంత్రి హోదాలో తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆయనపై రాళ్ళ వర్షం కురిపించారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం చంద్రబాబు సొంతం. కేంద్రమంత్రి అమిత్ షా ను చంద్రబాబు ఎవరి ఇంటికి తీసుకువెళ్ళారు? కరకట్ట మీద ఆయన నివసిస్తున్నది లింగమనేనికి చెందినది కాదా? ఇది ఒక అక్రమ కట్టడం కాదా? సాక్షాత్తు కేంద్ర హోంమంత్రికి తాము క్విడ్ ప్రో కో కింద కాజేసిన కట్టడంలోకి తీసుకువచ్చి విందు ఇస్తున్నాము అని వాస్తవం చెప్పి ఉంటే బాగుండేది. ఇటీవల కృష్ణానదికి వరద వచ్చినప్పుడు మా నివాసంలోని కింది ఫ్లోర్, మీరు కుర్చున్న ప్రదేశంలోనే అయిదు అడుగుల మేర వరద చేరింది, తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకుని అందులో నివసిస్తున్నాము అని నిజాలు చెప్పాల్సింది. దీనికి బదులుగా జగన్ గారి ప్యాలెస్ ల గురించి మాట్లాడుకున్నామని మీరు చెబుతున్న మాటలకు ఎక్కడైనా విశ్వసనీతయ ఉందా? 

- చంద్రబాబుకు హైదరాబాద్ లో విలాసవంతమైన భవనం

ఇటీవల రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ నిర్మాణాల గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ విభాగాల ద్వారా నిర్మించిన కట్టడాలను ఏం చేయాలో కూడా తెలియదని మంత్రి హోదాలో ఉండి నారా లోకేష్ మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఒక అద్భుతమైన ప్రభుత్వ కట్టడాన్ని జగన్ గారు నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తే, దానిని ఎలా వాడుకోవాలో తెలియని స్థితిలో మీరు ఉన్నారు. దానిని వైయస్ జగన్ నివాసం అని బుదరచల్లుతున్నారు. జగన్ గారి నివాసం తాడేపల్లి, హైదరాబాద్, బెంగుళూరుల్లో ఉన్నాయి. వాటిల్లో వందల గదులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే చంద్రబాబుకు హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. దానిని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ప్రజలకు తన నివాసాన్ని చూపించారా? జగన్ గారు తాడేపల్లిలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో నిత్యం ఈ భవనానికి వస్తుంటారు. ప్రారంభోత్సవం రోజున వందలాది మంది కార్యకర్తలను ఇక్కడికి పిలిచి భోజనం పెట్టారు. ఇదే చంద్రబాబు ఏనాడైనా హైదరాబాద్ లోని తన ఇంటికి ఎవరినైనా అనుమతించారా? ఒక్క కార్యకర్తకైనా భోజనం పెట్టారా? చంద్రబాబులా వైయస్ జగన్ గారు ఎవరి నుంచి క్విడ్ ప్రో కో కింద ఇళ్ళు తీసుకోలేదు. జగన్ గారి తాత గారి నుంచి ఆస్తులు ఉన్నాయి. మొదటి నుంచి చక్కని ఇళ్ళు నిర్మించుకుని, వాటిల్లో నివసిస్తున్నారు. కరకట్ట మీద ఒక అక్రమ నివాసంలో ఉన్న చంద్రబాబుకు వైయస్ జగన్ గారిని విమర్శించే అర్హత లేదు. 

- డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకమే కారణం

పోలవరంలో రెండో డయాఫ్రం వాల్ నిర్మాణంకు పనులు ప్రారంభిస్తున్నామని ప్రకటించుకున్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకం, ఆనాడు టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం. కాఫర్ డ్యాం నిర్మించి నదిని డైవర్ట్ చేయకుండా తీసుకున్న నిర్ణయం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. దీనికి చంద్రబాబు, అప్పటి మంత్రి దేవినేని ఉమలు బాధ్యత వహించాలి. వీళ్ల తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైయస్ జగన్ గారిపై బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ అద్భుతంగా శరవేగంగా పనులు ముందుకు సాగాయి. మా హయాంలోనే రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేసి, స్పిల్ వే నిర్మాణం పూర్తి చేశాం. కరోనా సమయంలో కూడా పనులు జరిగేలా చర్యలు తీసుకున్నాం. 

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... 
తిరుపతిలో మానవ తప్పిదం వల్లే ఆరుగురు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద నిర్లక్ష్యం వల్ల ఆరుగరు భక్తులు బలయ్యారు. అలాంటప్పుడు ఎన్డీఏలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెబితే, మేం ఎందుకు క్షమాపణ చెప్పాలంటూ టీటీడీ చైర్మన్ అన్నారు. మానవ తప్పిదం వల్ల తిరుమలలో జరుగుతున్న ఉపద్రవాలను నివారించేందుకు ఎన్డీఏ ఎందుకు రావడం లేదు? రెండు రోజుల కిందట తిరుమల కొండపై గుడ్డు బిర్యానీ తిన్నారు. ఇలాంటి అనాచారాలను నియంత్రించలేని ప్రభుత్వం మా హయాంలో శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసింది. ఆ పాపమే కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. 


ఈ రాష్ట్రంల ఎన్డీఏ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోంది. దేనిమీదా నియంత్రణ లేదు. పత్రికల్లో అనుకూలంగా పుంఖానుపుంఖాలుగా కథనాలను రాయించుకుంటున్నారు. చంద్రబాబు గంటల తరబడి పొంతన లేకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలపునిస్తున్నాడు. ఆయన, వారి కుమారుడు మాత్రం ఒక్కరినే కంటారు. బయటి వారికి మాత్రం ఎక్కువ మంది సంతానంను కనాలని పిలుపునిస్తున్నారు. అలాంటప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంటే వారికి సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఎందుకు చెప్పరు? చంద్రబాబు సమర్థుడైన నాయకుడు, ఆలోచనాపరుడు కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగినవన్నీ మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లే. నిత్యం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు. 

 


 

Source From: రాజాజీ