సినిమా చాన్స్ కావాలా... నా కోరిక తీర్చు...!

 ఒక్క చాన్స్ అంటూ... సినిమానే ప్రపంచంగా తన భవిష్యత్తును ఊహించుకుని వచ్చిన ఒక మహిళపై సినీరంగానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సినిమాలో అవకాశం కావాలంటే ఆడిషన్ కు రావాలని పిలిచి తన కోరిక తీర్చుకున్నాడు. అమాయకంగా సినిమా చాన్స్ కోసం వచ్చి ఈ మృగాడి కామవాంఛకు బలైన బాధితురాలు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.


Published on: 18 Jan 2025 17:25  IST

 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మహిళ కొంతకాలంగా సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ లో కృష్ణానగర్, ఇందిరానగర్ ల చుట్టూ తిరుగుతోంది. వివాహమైన ఈ మహిళ తన భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో హైదరాబాద్ లోనే నివాసం ఉంటూ సినిమాల్లో జూనియర్ ఆర్టీస్ట్ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బతుకు దెరువుకోసం మణికొండలో హౌస్ కీపింగ్ లో పనిచేస్తూ, మిగిలిన సమయాల్లో సినిమా చాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ వంటరి మహిళను గమనించిన సినిమాల్లోని డైరెక్షన్ విభాగంలో పనిచేసే కాటేకొండ రాజు అనే వ్యక్తి సినిమాలో చాన్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. మూడు రోజుల కిందట కృష్ణానగర్ లోని ఒక హోటల్ లో ఆడిషన్ ఉంది రమ్మని కబురు చేశాడు. మొదటిరోజు నమ్మకంగా ఆమెతో ఫోటో షూట్ చేశాడు. తరువాత రోజు కూడా ఆడిషన్ కు రావాలని చెప్పడంతో ఆమె హోటల్ కు వెళ్ళింది. సినిమా చాన్స్ కావాలంటే తన కోరిక తీర్చాలంటూ కాటేకొండ రాజు ఆమెను వత్తిడి చేశాడు, అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా లైంగిక దాడి చేశాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. రాజుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Source From: రాజాజీ