ఏపీలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలోని పేద విద్యార్ధులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. తనకు కావాల్సిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


Published on: 25 Jan 2025 13:31  IST

రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సేఫ్ క్లోస్ కోసం జీఓ నెం.27 ని కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.27ని రద్దు చేయాలి. పార్వతీపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేయడం దుర్మార్గం. చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ, కార్పోరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమంను అమలు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాదాపు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని అయినా ఈ రాష్ట్రంలో ప్రారంభించారా? వైయస్ జగన్ గారు అయిదేళ్ళ తన పాలనలో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్రంలో ప్రారంభించేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వాటిని కూడా ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు తెగబడటం దారుణం. చంద్రబాబు హయాంలో ఆయనకు సన్నిహితుడైన నారాయణకు, ఎన్ఆర్ఐ, జీఎస్ఆల్ వంటి సంస్థలకు మెడికల్ కాలేజీలను అప్పగించారు. ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఒక్కో సీటుకు కోటిన్నర రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక ఫీజీ సీటుకు దాదాపుగా మూడున్నర కోట్లు వసూలు చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్ధులు ఇంత మొత్తం చెల్లించి వైద్యవిద్యను చదవగలరా?

- ఎన్నికలకు ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై ఇచ్చిన హామీ విస్మరించారు
 
వైద్యవిద్యను కార్పోరేట్ వ్యవస్థగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు జగన్ గారు 17 మెడికల్ కాలేజీలను సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధులు చెల్లించే డబ్బు ప్రభుత్వానికి జమ అవుతుంది, ఈ డబ్బుతో ప్రభుత్వమే ఆ కాలేజీలను నిర్వహిస్తుందని చెబితే దీనిని ఆనాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తీవ్రంగా విమర్శించారు. మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వమే ఈ కాలేజీలను నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఈ రోజు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ హామీని విస్మరించారా? ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు. 2024 ఉగాధి పండుగ రోజు వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తాను, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఉగాధి పండుగ రోజు ఇచ్చిన మాటనే విస్మరించిన ఘనుడు చంద్రబాబు. ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఇదే తరహాలో నిర్వీర్యం చేస్తున్నాడు. తనకు అనుయాయులుగా ఉన్న వారి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్ధులకు ఇకపై మెడికల్ విద్య అనేది కనుమరుగు అవుతోంది. చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 జనరల్ సీట్లను రాష్ట్రంలోని విద్యార్ధులు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 2300 జనరల్ సీట్లు ఉన్నాయి. వాటికి అదనంగా మరో 2450 కొత్త జనరల్ సీట్లు కూడా జత అయితే మొత్తం 4750 విద్యార్ధులకు అందుబాటులోకి వస్తాయి. పేద విద్యార్ధులు కేవలం ప్రభుత్వంకు చెల్లించే ఫీజు చెల్లించి వైద్యవిద్యను చదువుకునే అవకాశంను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో యాబై శాతం అంటే 1225 సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సి ఉంది. ఇవ్వన్నీ వారు నష్టపోతున్నారు. 

- మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాస్తారా?

మెడికల్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాలకే కాదు, విదేశాలకు కూడా వెళ్లి లక్షల రూపాయలు వెచ్చించి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వైద్య విద్య కోసం అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు సీఎంగా వైయస్ జగన్ గారు ప్రభుత్వం తరుఫున భూములను కేటాయించి, నిధులు సమకూర్చి కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తుంటే, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వాటిని అడ్డుకుంటోంది. అయిదు మెడికల్ కాలేజీలు వైయస్ జగన్ గారి హయాంలోనే ప్రారంభించారు. మిగిలిన వాటిల్లో కొత్తగా సీట్లు వద్దని, కొత్త కాలేజీలు వద్దని కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి మరో మూడు లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చారు. ఈ ఏడు నెలల్లోనే దాదాపు నాలుగు లక్షల
కోట్లు అప్పులు తెచ్చారు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది రూ.16000 కోట్లు. దీనిలో ఇప్పటికే కొంత మేర వైయస్ జగన్ గారు ఖర్చు చేశారు. కేవలం 2 శాతం నిధులను బడ్జెట్ లో కేటాయించినా ఈ అన్ని మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల పోస్ట్ లు ఖాళీగానే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందడం లేదు. మెడికల్ కాలేజీలు వచ్చి, సీట్లు భర్తీ అయితే అవసరమైన మేరకు వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పేదలకు ఉచితంగా వైద్యం లభిస్తుందా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో నిర్వహిస్తే వారు పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయరా? 

- ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటుపరంపై రెఫరెండంకు సిద్దమా?

వైయస్ జగన్ గారు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని భావించారు. దీనిని చూసిన యూపీ ప్రభుత్వం కేంద్రం ద్వారా 73 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. వారంతా కూడా ప్రభుత్వ నిర్వహణలోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వైద్యరంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగిస్తున్నారు. విలేజ్ క్లీనిక్ లను మూసేస్తున్నారు. ఇప్పడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై తమ వివక్షతను చూపుతున్నారు. 
మెడికల్ విద్యపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రిఫరెండంకు వెడతారా? వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ పోరాడుతుంది. 

- విజయ సాయిరెడ్డి నిర్ణయం విస్మయం కలిగించింది

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడం విస్మయం కలిగిస్తోంది. పార్టీ కష్టసమయంలో అండగా నిలబడటానికి బదులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం సరికాదు. వైయస్ జగన్ గారి వల్ల పదవులు పొంది, తరువాత సొంత నిర్ణయాలతో రాజీనామా చేయడం మంచిది కాదు. 


 

Source From: రాజాజీ