మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదమా...? విద్రోహమా...?

లక్నో: కోట్లాధి మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే త్రివేణి సంగమం వద్ద అగ్నిప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తును ప్రారంభించాయి. ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం వార్తలు రావడంతో జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళిన తమ వారి గురించి సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


Published on: 19 Jan 2025 17:24  IST

 

యూపిలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళలోని సెక్టార్ 19లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన గుడారాల్లో రెండు వంటగ్యాస్ సిలెండర్లు ప్రమాదవశాత్తు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. దాదాపు ముప్పైకి పైగా గుడారాలు ఈ మంటల్లో ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. రోజుకు సుమారు ఇరవై లక్షలమంది ఈ మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 19వ తేదీ నాటికే దాదాపు ఏడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దేశ వ్యాప్తంగా మొత్తం నలబై కోట్ల మందికి పైగా భక్తులు మహా కుంభమేళా కు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎస్ బృందాలు, ఫైర్ ఫైటింగ్ టీంలతో పాటు క్విక్ రెస్పాన్స్ బృందాలను కూడా ప్రభుత్వం ఇక్కడ  మోహరించింది. కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం వద్దకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించే క్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ ఈ గ్యాస్ సిలెండర్ల పేలుడు జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 


 

Source From: రాజాజీ