"థైస్ & లెగ్స్" ఇన్ స్ట్రాలో మొత్తం అవే ఫోటోలు

సోషల్ మీడియాలో "థైస్ & లెగ్స్" ఇన్ స్ట్రా అకౌంట్ ఫోటోలను చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. అనేక మంది మహిళలకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలను చూసి అవాక్కయ్యారు. సదరు మహిళలకే తెలియకుండా ఈ ఫోటోలు తీసి, తన ఇన్ స్ట్రా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ సోషల్ మీడియా సైకోను తెలంగాణ రాష్ట్రంలోని జిగిత్యాల పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.


Published on: 18 Jan 2025 17:07  IST

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్ పూర్ కు చెందిన బండారి శ్రవణ్ జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. స్టైల్ గా డ్రస్ చేసుకుని, బైక్ పై హుషారుగా చక్కర్లు కొడుతూ తిరిగే ఈ సోగ్గాడు సోషల్ మీడియాలో సైకోలా వ్యవహరిస్తున్నాడని పాపం ఎవరికీ తెలియదు. తన సెల్ ఫోన్ నుంచి పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతూ మహిళల ఫోటోలు తీస్తూ వాటిని ఎడిట్ చేసి ”థైస్ అండ్ లెగ్స్” అనే పేరుతో ఓపెన్ చేసి తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేస్తున్నాడు. అభ్యంతరకంగా ఆ ఫోటోల్లో కొన్ని మార్పులు చేసి తన సోషల్ మీడియాను వైరల్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇందులో ఒక ఫోటో ఒక మహిళకు చెందిన వారు గుర్తించి సదరు మహిళ దృష్టికి తీసుకువెళ్ళారు. ఆమె తనకు తెలియకుండా తన ఫోటోలను తీసి, అసహ్యంగా పోస్ట్ చేయడంపై ఈ నెల 11న జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన జగిత్యాల పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళలను ఫొటో తీసి వాటిని ఎడిట్ చేసి ”థైస్ అండ్ లెగ్స్” ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేస్తున్నాడని, వీటికి వచ్చే అసభ్యకరమైన కామెంట్లను ఇతరులతో షేర్ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడు బండారి శ్రవణ్ ను అరెస్ చేయడంతో పాటు అతడు కొనసాగిస్తున్న సదరు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ను బ్లాక్ చేయించామని డీఎస్పీ రఘు చందర్ మీడియాకు వెల్లడించారు. ఇతగాడి ఇన్ స్టాలో అనేక మంది మహిళల ఫోటోలు ఉండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. మన మధ్యే గౌరవనీయంగా తిరుగుతూ సోషల్ మీడియాలో ఇటువంటి దారుణాలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Source From: Telugu Peoples