టీడీపీని కలవరపెడుతున్న యనమల లేఖ

యనమల లేఖాస్త్రం టీడీపీని కలవరపెడుతోంది. కాకినాడ సెజ్‌ పేరుతొ బీసీ (మత్స్యకారుల)ల సాగులో వున్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొని ‘కమ్మ‘ పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిందని యనమల ఆరోపించారు. కమ్మలు అంటే బాబు సామాజికవర్గమని వేరే చెప్పక్కర్లేదు. దీనర్థం చంద్రబాబుపైన ఉరుములు లేకుండా మెరుపుదాడి చేయడమే.


Published on: 10 Dec 2024 13:39  IST


నిజానికి గత కాంగ్రెస్‌ (వైఎస్సార్‌) హయాంలోనే సెజ్‌ కోసం భూసేకరణ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా గడవకముందే యనమల తమ ప్రభుత్వాన్నే బీసీ కార్డుతో కొట్టారు. లేఖ రుచి, వాసన బట్టి చూస్తే వైఎస్సార్‌ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి డ్రాఫ్టింగ్‌ చేసినట్టు కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల వేళ యనమల కొట్టిన దెబ్బకు పార్టీ నాయకత్వం ఇంకా తేరుకున్నట్టు లేదు.
యనమల ఇప్పుడు ఎందుకిలా చేశారు? పార్టీ ఆయనకు అన్యాయం ఏమయినా చేసిందా? టీడీపీ అధికారంలో వున్నా, లేకున్నా యనమల ఎన్నికల్లో గెలిచినా, ఓడినా అధికారం తన గడప దాటి ఎప్పుడూ బయటకు పోలేదు. అయన ఇప్పటివరకూ ఎమ్మెల్సీ. జగన్‌ హయాంలో అయన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. తాజా ఎన్నికల్లో కూతురు ఎమ్మెల్యే, అధికారపార్టీ విప్‌ కూడా. ఆమె భర్త, యనమల అల్లుడు పార్లమెంటు సభ్యుడు. వియ్యంకుడు ఎమ్మెల్యే. ఇంకా యనమల పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు. కౌన్సిల్‌లో పదవీకాలం పూర్తయిన కొద్దిరోజులు కూడా తను ఆగేలా లేరు. రాజ్యసభకు వెళ్లాలని ఉబలాటం. అదనంగా కూతుర్ని రాష్ట్రంలోనూ, అల్లుడ్ని కేంద్రంలోనూ మంత్రులను చేయాలనే ఆరాటం. 

అలాటి యనమలను అధినాయకత్వం ఎందుకు భరించాలి? ఈ మాట చెప్పాలంటే కొంత వెనక్కు వెళ్ళాలి. ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపేయడానికి ఆనాటి అసెంబ్లీ స్పీకర్‌గా వున్న యనమల.. బాబుకు తురుపు ముక్కలా ఉపయోగపడ్డారు. దానికి ప్రతిఫలంగా బాబు గత 30 ఏళ్ళ నుంచి పైసా పైసా లెక్కగట్టి వడ్డీతో సహా యనమలకు చెల్లిస్తూనే వున్నారు. ఇప్పటికీ యనమలకు బాబు ఋణం తీరినట్టు లేదు. ఆలా  యనమల పార్టీలో ముదిరిపోయారు. బీసీ దొరగా రూపాంతరం చెందారు. హోమ్‌ మంత్రిగా చేసిన పార్టీ సహచరుడు నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాకి సైతం యనమల ఎదురు ఛాంబర్‌లో కూర్చునే యోగ్యత లభించలేదు. ఇన్నాళ్లూ యనమల పెత్తనం పార్టీలో ఆలా సాగింది. 

రోజులన్నీ ఒకే మాదిరిగా వుండవు కదా. పార్టీలో తరం మారుతోంది. పార్టీ పగ్గాలు కొడుకు లోకేష్‌కు అప్పజెప్పి చంద్రబాబు.. కృష్ణా, రామా.. అనుకునే దశలోకి వచ్చేశారు. తలుపు తోసుకొని బాబూ ఛాంబర్‌లోకి నేరుగా వెళ్లే స్థితి నుంచి లోకేష్‌ ఛాంబర్‌ బయట వెయిట్‌ చేసే దశలోకి యనమల వెళ్లిపోయారు. ఆలా యనమలకే కాదు. బాబు సహచరులుగా వుండే సీనియర్లకు కూడా లోకేష్‌ మింగుడు పడట్లేదు. కొరకరాని కొయ్యలాగా తయారయ్యారు. యూవరాజు చేతుల్లోకి అధికార బదలాయింపు జరిగేకాలంలో ఇవన్నీ సహజం అనుకోండి. ఈ క్రమంలో ఆకాశాన్నంటే రాజప్రాసాదాలు నేల కూలడం కూడా అంతే సహజం. యనమలకు అదే ప్రాప్తమా? వేచి చూడాలి. 

– నాగరాజ గాలి, సీనియర్‌ జర్నలిస్టు 
 

Source From: Yanamala Letter to Cbn