తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం!

ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడును ఆస్ట్రేలియన్ సైంటిస్టులు కనుగొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ని గంటలోనే తేనె టీగల విషం ద్వారా తొలగించవచ్చని తేలింది.


Published on: 24 Sep 2024 23:07  IST

తేనెటీగ విషంలో ఉండే మెలిటిన్ అనే పెప్టెడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ ఒక గంటలోనే చంపేస్తున్నాయని గుర్తించారు. కీమోథెరపీతో కలిపి మెలిటిన్ను ప్రయోగిస్తే.. అత్యంత వేగంగా క్యాన్సర్ కణాలపై ఉండే పొరలు విచ్ఛిన్నమై, ఆ కణాలు నాశనం అవుతున్నాయని హ్యారీ పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.

బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకునేందుకు ఎలుకలపై జరిపిన పరిశోధనలో 'హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్', 'హెచ్ ఈఆర్ 2 ఎన్ రిచ్డ్', 'ట్రిపుల్ నెగెటివ్' బ్రెస్ట్ క్యాన్సర్ అనే మూడు సబ్ టైప్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపైకి మెలిటిన్ ను ప్రయోగించి పరీక్షించారు. దీంతో హెచ్ఆర్2 ఎన్ రిచ్డ్, ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను మెలిటిన్ వేగంగా నాశనం చేసినట్టు తేలింది.

“బ్రెస్ట్ క్యాన్సర్ లోని ఉప రకాల కణాలు, సాధారణ కణాలపై మెలిటిన్ ప్రభావం గురించి గతంలో ఎవరూ పరిశోధన చేయలేదు. అందుకే మేం బ్రెస్ట్ క్యాన్సర్లోని మూడు ఉప రకాల కణాలపై మెలిటిన్ ప్రభావాన్ని స్టడీ చేశాం. దీంతో రెండు రకాల క్యాన్సర్ కణాలను ఇది సమర్థంగా చంపుతున్నట్టు గుర్తించాం” అని రీసెర్చ్ లో పాల్గొన్న సైంటిస్ట్ కియారా డఫీ వెల్లడించారు.

20 నిమిషాల్లోనే పని షురూ..

ఈ రీసెర్చ్ కోసం 312 తేనెటీగల విషాన్ని సేకరించి సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. క్యాన్సర్ కణాల విభజనను మెలిటిన్ 20 నిమిషాల్లోనే అడ్డుకుంటుందని, ఆ తర్వాత 60 నిమిషాల్లోనే కణాలను చంపేస్తుందని గుర్తించారు. మెలిటిన్ ను కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చని, కృత్రిమంగా తయారు చేసిన మెలిటిన్ కూడా క్యాన్సర్ పై అదే స్థాయిలో పని చేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల 'ఎన్ పీజే నేచర్ ప్రిసిషన్ ఆంకాలజీ' జర్నల్లో ప్రచురితమయ్యాయి.

తేనెటీగల విషంలో మెలిటిన్ పదార్థం దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. దీనివల్లే తేనె టీగలు కుట్టినప్పుడు నొప్పి, వాపు, బెందులు వస్తుంటాయి. అయితే, ఇది అంటే పడనివారికి(అలర్జీ ఉన్నవారికి) తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే దీనిని సురక్షితంగా వాడటంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. 

Source From: Honeybee