పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష ఎవరి కోసం?

ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల కోసం దీక్షలు చేయడం చూస్తుంటాం. కానీ అధికారంలో ఉన్న పార్టీలు దీక్షలు చేయడం విచిత్రమే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న దీక్ష వెనుక ఏదైనా వ్యూహం ఉందా? దీని వెనుక ఎవరున్నారోననే చర్చ జోరుగా నడుస్తోంది.


Published on: 23 Sep 2024 10:58  IST


    ఏపీలో బీజేపీ ఒక ప్లాట్‌ఫారం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది. అనేక ప్రయోగాలు చేసినా అవి సఫలం కాలేదు. కానీ ప్రస్తుతం బీజేపీకి పవన్‌ కళ్యాణ్‌ రూపంలో ఎదగడానికి ఒక అవకాశం వచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీ ఆదేశాలు తూచ తప్పకుండా పాటించే పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

    ఈ దిశగా వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని మార్పులు జరుగుతాయో చూడాలి. బీజేపీ బాధ్యతలు చూడటానికి ఒక ఫేమ్‌ కావాలి. అది పవన్‌ కళ్యాణ్‌ రూపంలో దొరికిందంటున్నారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీకి ఒరిగేది ఏమీ లేదు. బీజేపీ ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక ఒకటి.

 పవన్‌ ఎన్నికలకు ముందు ఏకకాలంలో బీజేపీ, టీడీపీలతో బంధం కొనసాగించి చివరికి ఎన్నికల పొత్తు కుదర్చగలిగారు. నిజానికి బీజేపీకి చంద్రబాబుతో కలిసి నడవడం ఇష్టం లేదని చెబుతారు. గతంలో జరిగిన పరిణామాలు, ఆయన వ్యవహారశైలి వంటివి ఇందుకు కారణాలు. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావించింది. కానీ పవన్‌ మాత్రం తెలుగుదేశాన్ని కూడా కలుపుకోవాలని గట్టిగా ప్రయత్నించి కాషాయ పెద్దలను ఒప్పించారు. రాజకీయాల లక్ష్యం అంతిమంగా అధికారాన్ని చేజిక్కించుకోవడమే కావడంతో బీజేపీ చంద్రబాబుతో కలవక తప్పలేదు. పవన్, చంద్రబాబు అనుకున్నట్లు ఈ మూడు పార్టీల కలయిక సూపర్‌ హిట్‌ అయింది. దీంతో పవన్‌ ఇమేజీ జాతీయ స్థాయిలో పెరిగింది. ఏపీలో వచ్చిన అద్భుత విజయానికి పవన్‌ కళ్యాణ్‌ కారణమని బీజేపీ నమ్ముతోంది. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నారు. మిగతా టీడీపీ నేతలు ఒప్పుకున్నా లేకపోయినా ఇది వాస్తవం. 

    ఈ నేపథ్యంలో బీజేపీ పవన్‌ ద్వారా ఏపీలో బలం పెంచుకోవాలని చూస్తోంది. మున్ముందు చంద్రబాబుతో కలిసి నడిచినా నడవకపోయినా పవన్‌ను మాత్రం వదిలేలా లేదు. తాజాగా తిరుమల తిరుపతి వ్యవహారాన్ని అందుకు ఒక అవకాశంగా భావిస్తోంది. అందుకే ఆయనతో ప్రాయశ్చిత్త దీక్ష చేయిస్తోందట. కల్తీ నెయ్యి విషయాన్ని నెమ్మదిగా భక్తి భావం వైపు మరలేలా చేయడం ద్వారా హిందువులు, సాధారణ ప్రజలను బుట్టలో వేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. 

    ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లుగా సపోర్ట్‌ చేసిన జగన్‌కు బీజేపీ గట్టి షాక్‌ ఇచ్చింది. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ఆఫీసు మీద బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. పార్లమెంట్‌లో ప్రతి అడ్డమైన బిల్లుకు చేతులు ఎత్తిన వైఎస్సార్‌సీపికి బీజేపీ బాగా బుద్ది చెప్పినట్లే. బీజేపీ ప్రస్తుతం జగన్‌ను వదిలేసి పవన్‌పై ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. 
 

Source From: pavan kalyan