భీమవరం పదవుల హారం

రాజకీయాలకు నెలవైన భీమవరం ఇప్పుడు రాజకీయ పదవులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఒక ప్రాంతానికి ఒక పదవి రావడమే గగనం. అలాంటిది భీమవరానికి ఇప్పుడు ఏకంగా ఆరు అత్యంత కీలకమైన పదవులు లభించాయి. గత ప్రభుత్వంలో వచ్చినదాంతో పోల్చుకుంటే ఆరు పదవులు. అన్ని పదవులు అతి ముఖ్యమైనవే. జిల్లాల విభజన తర్వాత జిల్లా కేంద్రంగా మారిన భీమవరానికి ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యత ఉచ్చ దశలో ఉన్నట్లే చెప్పాలి.


Published on: 26 Nov 2024 21:47  IST

 

  

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనూహ్యంగా నరసాపురం ఎంపీ భూపతి శ్రీనివాసవర్మకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఆయనది భీమవరమే. దీంతో భీమవరానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇటీవలే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఉండేది కూడా భీమవరం పట్టణానికి ఆనుకుని చినమిరం గ్రామంలోనే. ఉండి టికెట్‌ను త్యాగం చేయడంతో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వం. భీమవరం ప్రాంతంలో అందరికీ చిరపరిచితుడైన వేగేశ్న సూర్యనారాయణరాజు (కనకరాజుసూరి) జనసేన కోటాలో ఏపీ క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) ఇటీవలే ఎన్నికయ్యారు.

అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలోనే భీమవరానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మండలి ఛైర్మన్‌ను చేసింది. దళిత వర్గానికి చెందిన ఒక అట్టడుగు స్థాయి నేత శాసన వ్యవస్థలోనే పెద్ద పదవిని పొందడం విశేషం. ఆయన మున్సిపల్‌ కౌన్సిలర్‌ స్థాయి నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఎదిగారు.

పశ్చిమగోదావరి జిల్లాగా చూసుకుంటే (భీమవరం జిల్లా కేంద్రం) పక్కనే ఉన్న పాలకొల్లుకి చెందిన నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. నర్సాపురానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. తాడేపల్లిగూడేం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కి ప్రభుత్వ విప్‌గా అవకాశం లభించింది. ఇలా భీమవరంతోపాటు పరిసర ప్రాంతాలకు పదవుల వరద వచ్చినట్లు కనిపిస్తోంది.

భీమవరం రాజకీయంగా ప్రతి సందర్భంలోను సత్తా చాటుతూనే ఉంది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పీవీ నర్శింహారావు(కాంగ్రెస్‌) మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం టీడీపీ నుంచి 11 ఎంపీలను చీల్చి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి నిలబెట్టిన మాజీ ఎంపీ భూపతిరాజు విజయకుమార్‌రాజుది భీమవరమే.
 టీడీపీలో గండిపేట మేథావిగా పేరొందిన మాజీ ఎంపీ మెంటే పద్మనాభం భీమవరమే. 
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఆ పార్టీకి ఒకప్పుడు దిశానిర్ధేశం చేసిన యర్రా నారాణస్వామి సైతం భీమవరంలోనే ఉండేవారు. 
అంతే కాదు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు సైతం సారధ్యం వహించే అధ్యక్షులు, కార్యదర్శులుగా భీమవరం వాళ్లే ఎక్కువగా హవా నడిపేవారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 

చరిత్రలోకి వెళితే.. 
రాష్ట్రంలో భీమవరం పేరు చెబితే తెలియని వారుండరు. వేల సంవత్సరాల చరిత్రలో తనకంటూ సొంతంగా కొన్ని పేజీలను సృష్టించుకుంది భీమవరం. రాజుల పాలన నుంచి స్వాతంత్య్ర ఉద్యమం వరకు తనకంటూ ప్రత్యేకతను చాటుకుని సగర్వంగా కాలరెగరేసి నిల్చుంది. పెదవేగిని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో తనకంటూ గుర్తింపును పొందిన భీమవరం ప్రకాశిçస్తూనే ఉంది. వేంగి రెండవ చాళుక్య భీముడి పాలనలో క్రీ.శ. 912లో భీమవరంలో పంచారామ క్షేత్ర ఆలయాన్ని అభివృద్ధి చేయచడంతోపాటు భీమేశ్వర ఆలయాన్ని నిర్మించడంతో భీమవరం ప్రసిద్ధికెక్కింది.
 బ్రిటీష్‌ కాలంలో 1832 నుంచి తాలూకా హెడ్‌క్వార్టర్‌గా ఉన్న భీమవరం స్వాతంత్య్రం వచ్చే వరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఉండేది. స్వాతంత్రోద్యమంలో 1922–28 మధ్య పన్నుల సహాయ నిరాకరణ విజయవంతం కావడంతో మహాత్మ గాంధీజీచే రెండవ బార్డోలిగా ప్రశంసలు అందుకుంది. 1980 దశకంలో నీలి విప్లవానికి నాంది పలికి.. ఆక్వా సాగుతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. మావుళ్లమ్మ, అమావాస్య, పౌర్ణమి రంగులు మారే శివలింగంతో పంచరామాక్షేత్రంతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లా విభజనతో భీమవరం జిల్లా కేంద్రంగా నిలిచింది. అదీ భీమవరం ప్రత్యేకత.


- రాజీ

Source From: bhivaram politics