5 రోజుల్లో ఇండియా నుంచి కెన్యా చేరుకున్న అమూర్‌ ఫాల్కన్‌ పక్షి

అలుపెరగకుండా వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అమూర్‌ ఫాల్కన్‌ వలస పక్షుల్లో ఒకదాని తాజా పయనం ఆశ్చర్యపరుస్తోంది.


Published on: 30 Nov 2024 19:06  IST

మన దేశం నుంచి బయలుదేరిన 5 రోజుల 17 గంటల్లో అది సోమాలియా చేరుకుని అక్కడి నుంచి కెన్యాలోకి ప్రవేశించింది. మధ్యలో ఎక్కడా ఆగకుండా పలు దేశాలు, అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని అది తన గమ్యాన్ని చేరుకుంది. వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వాలంటీర్లు సైబీరియా నుంచి వచ్చిన రెండు పక్షులను మణిపూర్‌లో పట్టుకుని వాటికి శాటిలైట్‌ రేడియో ట్యాగ్‌లు అమర్చారు. స్థానిక గ్రామాలైన చిలువాన్, గ్యాంగ్‌రామ్‌ పేర్లు వాటికి పెట్టారు. వాటిలో చిలువాన్‌–2 పేరు పెట్టిన పక్షి నాన్‌స్టాప్‌గా ఎగురుతూ అరేబియా సముద్రాన్ని దాటి ఐదు రోజుల 17 గంటల తర్వాత సోమాలియాలోని తన మొదటి గమ్యానికి చేరుకున్నట్లు రేడియో ట్యాగ్‌ ద్వారా దాని గమనాన్ని పర్యవేక్షించిన సైంటిస్టు సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 8వ తేదీన శాటిలైట్‌ రేడియో ట్యాగ్‌ అమర్చగా మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహగర్‌ నుంచి చిలువాన్‌ 10వ తేదీన నాన్‌స్టాప్‌ జర్నీ మొదలుపెట్టి 15వ తేదీ నాటికి సోమాలియా చేరుకున్నట్లు గుర్తించారు. మధ్యలో అరేబియా సముద్రాన్ని కూడా అవలీలగా దాటేసింది. గ్వాంగ్‌రామ్‌ అనే పేరు పెట్టిన మరో పక్షి మాత్రం తమెంగ్‌లాంగ్‌లోని చిలువాన్‌ రూస్టింగ్‌ సైట్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. చిలువాన్‌–2 గ్రేట్‌ హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని ఒక విమాన మార్గంలో ఉన్నట్లు తెలిపారు.

సైబీరియా టు ఆఫ్రికా వయా ఇండియా 
ఫాల్కన్‌ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అమూర్‌ ఫాల్కన్‌ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుండి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాలపు మైదానాలకు వెళతాయి. ఈ క్రమంలో 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యలో నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో అవి ఆగిపోతాయి. నాగాలాండ్, మణిపూర్‌లో వాటిని ‘అఖుయిపుయినా’ అని పిలుస్తారు. సగటున 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలల్లో ఇవి తిరుగు ప్రయాణమై మళ్లీ సైబీరియా వెళతాయి. తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతాయి.
 
లక్షల సంఖ్యలో పక్షులు
  ఆర్కిటిక్‌ టర్న్‌ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా వీటికి పేరుంది. 2018 నుంచి మణిపూర్‌లో అముర్‌ ఫాల్కన్‌ వలస ప్రయాణాలు, మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్‌ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్‌లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియడంలేదు. లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం రెండు, మూడు పక్షులకు మాత్రమే రేడియో ట్యాగ్‌లు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అమూర్‌ ఫాల్కన్‌ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26 వేల కిలోమీటర్లు వెళ్లడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్లీ చిలువాన్‌–2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని డబ్ల్యఐఐ (వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) సైంటిస్టు సురేష్‌కుమార్‌ తెలిపారు. పర్యావరణం, వాతావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలాన్ని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోతుంది.

Source From: amur falcon