షర్మిల, విజయమ్మపై కోర్టుకెళ్లిన జగన్

సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల వివాదంపై సెప్టెంబర్‌ 10న జగన్, భారతిలు Nఇఔఖీని పిటిషన్‌ను ఆశ్రయించారు.వైఎస్‌ జగన్‌ తరఫున వై సూర్యనారాయణ కంపెనీల యాక్ట్‌ 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా ట్రిబ్యునల్‌ విచారణకు స్వీకరించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.


Published on: 23 Oct 2024 15:15  IST

ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, చాగరి జనార్దన్‌ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్‌ రెడ్డి, రీజినల్‌ డైరెక్టర్‌ సౌత్‌ ఈస్ట్‌ రీజియన్, రిజిస్ట్రారర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చారు. తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని.. 2019 ఆగస్ట్‌ 21న ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్ల కేటాయించామని.. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీకి సంబంధించిన షేర్లను విత్‌ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్‌లో ప్రస్తావించారు.

    తన సోదరిపై అప్యాయతతో షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామన్నారు జగన్‌. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్‌ను విరమించుకున్నట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు. రాజకీయపరంగా ఉన్న విభేదాలు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాయి. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్‌ అభ్యర్థించారు. వారిద్దరికి వాటాలు ఇవ్వదలుచుకోలేదని ప్రస్తావించారు. వైఎస్‌ జగన్, భారతిలు NCLTలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ చర్చనీయాంశంగా మారింది. 


 

Source From: Jagan vs Sharmila