జగన్‌ పిటీషన్‌.. రాజకీయ కుట్రను ఛేదించడానికేనా !

తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోర్టులో పిటీషన్‌ వేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆస్తి వివాదాలు చాలాకాలం నుంచి ఉన్నా ఉన్నట్టుండి ఇప్పుడు కోర్టుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? తనపై జరుగుతున్న కుట్రను తిప్పికొట్టడానికే జగన్‌ కోర్టును ఆశ్రయించారనే వాదన వినిపిస్తోంది. అలా చేయకపోతే ఆయన బెయిల్‌ రద్దయ్యే పరిస్థితి ఉంది. రద్దయ్యేలా చేసేందుకు షర్మిలను అడ్డుపెట్టుకుని జగన్‌ ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ముందుగానే ఆ విషయం తెలుసుకుని ఆయన అప్రమత్తమయ్యారు. అందుకే కోర్టులో పిటీషన్‌ వేసినట్లు తెలుస్తోంది.


Published on: 24 Oct 2024 14:42  IST


    పైకి చూడ్డానికి ఇది వైఎస్‌ కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదంగానే ఉన్నా కాస్త లోతుగా విశ్లేషిస్తే ఇందులోనూ రాజకీయం కనిపిస్తుంది. రాజకీయం అనడం కంటె రాజకీయ కుట్ర అని చెప్పడమే సరైనది. జగన్‌ను దెబ్బకొట్టే రాజకీయంలో ఆయన సోదరి షర్మిల చాలాకాలం నుంచి భాగమయ్యారు. దివంగత వైఎస్సార్‌ పేరు చెప్పుకుంటూనే ఆయన బద్ధ విరోధులతో ఆమె చేతులు కలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబును ఎంత వ్యతిరేకించేవారో అందరికీ తెలిసిందే. ఈనాడు, ఆంధ్రజ్యోతి గురించి ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్‌ ఎప్పుడూ విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు వాళ్లే ఆమెకు రాజకీయ గురువులు. తెర వెనుక మద్ధతుదారులు. వారు చెప్పినట్టల్లా షర్మిల నడుచుకోవడం, అందుకు తన తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకోవడం వైఎస్‌ అభిమానులను కలచివేస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇంట్లో జరిగే ప్రతి విషయం ఆంధ్రజ్యోతి పత్రికలో మరునాడు తాటికాయంత అక్షరాలతో వస్తోంది. తాజాగా జగన్‌కు షర్మిల రాసిన లేఖను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. దీన్నిబట్టే షర్మిల తన కుటుంబంలోని అన్ని విషయాలను టీడీపీకి, వాళ్ల మీడియాకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని అర్థమవుతోంది.

అసలు విషయం ఏంటంటే..
    వైఎస్‌ఆర్‌ జీవించి ఉండగానే జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాలపై ఒప్పందం జరిగింది. అందులో భాగంగానే కొన్ని ఆస్తులు ఆమెకు లభించాయి. కొన్ని ఇంకా ఆమెకు వెళ్లాల్సివుంది. అయితే ఈలోపు వైఎస్‌ చనిపోవడం, జగన్‌ కాంగ్రెస్‌ను వదిలేసి సొంత పార్టీ పెట్టుకోవడం, అనంతరం సీబీఐ, ఈడీ కేసులు చుట్టుముట్టడం వరుసగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జగన్‌ ఆస్తులన్నీ ఈడీ ఎటాచ్‌మెంట్‌లోకి వెళ్లాయి. ఎటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులను బదిలీ చేయడం, అమ్మడం చట్ట విరుద్ధం. అందుకే నేరుగా సోదరి పేరు మీద ఆస్తి బదిలీ చేయకుండా కొన్ని ఆస్తుల గురించి ఆమెకు ఎంఓయూ (ఒప్పందం పత్రం) రాసిచ్చారు. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో స్పష్టంగా రాశారు.

     అలా రాసుకున్న ఆస్తుల్లో సరస్వతి పవర్‌ ఒకటి. ఇందులోని షేర్లను సోదరికి ఇస్తానని జగన్‌ ఎంఓయూలో రాశారు. నమ్మకం కోసం ఆమెకు ఇస్తానన్న షేర్లను తల్లి విజయమ్మ పేరుతో 2019లో గిఫ్ట్‌ డీడ్‌  చేశారు. సీబీఐ, ఈడీ కేసులు తేలిన తర్వాత ఆ షేర్లను షర్మిల పేరు మీదకు బదిలీ చేసుకోవచ్చని ఒప్పందంలో రాశారు. దీని ప్రకారం ఈడీ కేసులు పూర్తయ్యే వరకు విజయమ్మకు గిఫ్ట్‌ డీడ్‌గా రాసిచ్చిన షేర్లను షర్మిల పేరు మీదకు బదలాయించకూడదు. కానీ ఎంఓయూకు విరుద్ధంగా షేర్లను తల్లి నుంచి షర్మిల తన పేరు మీదకు మార్పించుకున్నారు.

ఇదీ జగన్‌ ప్రత్యర్థుల పథకం
    ఈ షేర్లు బదలాయింపు వల్ల ఏం జరుగుతుంది? అవన్నీ షర్మిలకు దఖలుపడడం వరకూ ఒకే. కానీ ఆ తర్వాత జరిగేది ఏమిటి? ఈడీ ఎటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులను వేరే వారికి బదలాయించేందుకు అనుమతి లేదు. అయినా బదలాయించినట్లయింది. ఈ కారణంతో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు సిద్ధమయ్యారు. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయించి మళ్లీ ఆయన్ను జైలుకు పంపించాలనేది వారి పథకం. దీన్ని అమలు చేసేందుకు చాలా పెద్ద కథే నడిపారు. ఢిల్లీలోనూ లాబీయింగ్‌ నడిచింది. ఇప్పటికే జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని చంద్రబాబు మనుషులు కోర్టుల్లో పిటీషన్లు వేశారు. వాటిపై విచారణ జరుగుతోంది. తాజా పరిణామం వారికి అస్త్రంలా మారే పరిస్థితి ఏర్పడింది. 

    షేర్లు బదిలీ అవడం, దాని వెనుక జరుగుతున్న వ్యవహారాలు తెలుసుకున్న జగన్‌ ఊరికే ఉంటారా? దీనివల్ల తన బెయిల్‌ రద్దయ్యే అవకాశం ఉందని గ్రహించారు. ఇప్పుడు ఆయన ఎదుట ఉన్న మార్గం సోదరి షర్మిలకు రాసిచ్చిన ఎంఓయూను రద్దు చేసుకోవడం. అలా చేస్తేనే ఆయన చట్టపరంగా ఎటువంటి తప్పు చేయలేదని తెలుస్తుంది. లేకపోతే చట్టం దృష్టిలో ఆయన తప్పు చేసినట్టే. అందుకే నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఎంఓయూను వెనక్కి తీసుకుంటున్నట్లు పిటీషన్‌ వేశారు. ఇది తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు వ్యతిరేకంగా ఆస్తి కోసం వేసిన పిటీషన్‌లాగానే కనిపించవచ్చు. కానీ తెర వెనుక జరిగిన వ్యవహారాలను పరిశీలిస్తే అవన్నీ ఒక పథకం ప్రకారం జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి చేసినట్లు స్పష్టమవుతోంది. 

    జగన్‌ను రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాస్టర్‌ మైండ్‌ ఈ వ్యవహారంలో నిగూఢంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు భావిస్తున్నారు. కేవలం జగన్‌ను జైలుకు పంపాలనే లక్ష్యంతో షర్మిలను అడ్డుపెట్టుకుని పావులు కదిపారు. అయితే ఆయన అప్రమత్తమై కోర్టును ఆశ్రయించడంతో తల్లిని, చెల్లిని కోర్టుకు లాగాడనే ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే చంద్రబాబు వేసిన ఎత్తుగడను జగన్‌ చిత్తు చేశాడు. దీనివల్ల జగన్‌ క్రూరుడు, మూర్ఖుడు, ఆస్తి కోసం తల్లిని, చెల్లిని హింసిస్తున్నాడని కూని రాగాలు గట్టిగానే తీస్తున్నారు. ప్రజలు కూడా కొంతవరకు వీటిని నమ్మే అవకాశం ఉంటుంది. కానీ జగన్‌ అలా చేసి ఉండకపోతే ఇంకా నష్టం జరిగి ఉండేది.. 
 

Source From: ys jagan