జగన్ పై ఘాటు విమర్శలు చేసిన వాసిరెడ్డి పద్మ


Published on: 23 Oct 2024 15:12  IST


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆమె పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడిన వారికోసం జగన్ ఇప్పుడు గుడ్ బుక్, ప్రమోషన్లు అని అంటున్నారు.. నాయకులు, కార్యకర్తలకు కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు.. గుండె బుక్ అని ఆమె పేర్కొన్నారు. ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్.. గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని పార్టీకి పంపించిన లేఖలో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. జగన్ కు పార్టీని నడిపించడంలో బాధ్యత లేదు.. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని విమర్శించారు. అప్రజాస్వామిక పద్దతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరు.. గత ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ప్రజాతీర్పు తరువాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు వాసిరెడ్డి పద్మ దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు. అయితే, జగ్గయ్యపేట సీటు ఇవ్వకపోవడంతో గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగ్గయ్యపేట సీటు, పార్టీ వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
 

Source From: vasireddy padma