కార్యకర్త, సలహాదారు.. ఇప్పుడు సీఎం

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజకీయంగా వచ్చిన కష్టాలు ఆమెకు అవకాశాలుగా మారాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పని చేసి రాజకీయ చతురతతో పార్టీని నడిపించారు. అందుకే ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎంతో మందిని కాదని ఆమెకు ఢిల్లీ పీఠం అప్పగిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో కార్యకర్తగా తన కెరీర్‌ను మొదలుపెట్టిన అతిషి అతి తక్కువ సమయంలోనే కేజ్రీవాల్‌ శిబిరంలో ముఖ్య నాయకురాలిగా ఎదిగారు.


Published on: 17 Sep 2024 13:23  IST

    రాజకీయ వ్యూహాల్లో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం పదవిని వదులుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తన తర్వాత ఎవరిని ఆయన సీఎంపై పీఠంపై కూర్చోబెడతారనే దేశమంతా ఎదురు చూసింది. కేజ్రీవాల్‌ తర్వాత పార్టీలో ఆ స్థాయి ఉన్న నేత మనీష్‌ సిసోడియా. వీరిద్దరినీ ఢిల్లీ మద్యం కుంభకోణం పేరుతో బీజేపీ టార్గెట్‌ చేసి జైల్లో పెట్టింది. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనపై ఆరోపణలు రుజువయ్యే వరకూ సీఎం పదవి నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్‌ ప్రకటించారు. సిసోడియా కూడా జైలుకు వెళ్లి రావడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆప్‌ ఎవరిని సీఎం కుర్చీపై కూర్చోబెడుతుందనే ఉత్కంఠ ఏర్పడింది. కేజ్రీవాల్‌ సతీమణిని సీఎం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. మరికొందరు పేర్లు కూడా వినిపించాయి. కేజ్రీవాల్‌ మాత్రం అతిషికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 

ఆప్‌ మూల స్తంభాలైన కేజ్రీవాల్, సిసోడియా జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించింది అతిషినే. ఇక ఆ పార్టీ పని అయిపోయిందనుకున్న తరుణంలో ఎన్ని ఒత్తిడులు వచ్చినా రాజకీయ చతురతతో ఆమె అనధికారిక సీఎంగా ఢిల్లీ రాష్ట్రాన్ని నడిపించారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్య నేతలు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వ్యూహాత్మకంగా వారు పదవుల నుంచి తప్పుకుని అత్యంత నమ్మకస్తురాలిగా, సమర్థురాలిగా అవతరించిన అతిషికి పాలనా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

    అతిషి పూర్తి పేరు అతిషి మర్లెనా సింగ్‌. 1981 జూన్‌ 8న ఆమె జన్మించారు. ఆమెది పంజాబ్‌ రాజ్‌పుత్‌ కుటుంబం. తల్లితండ్రులు విజయ్‌ సింగ్, త్రిప్తా వాహి ఇద్దరూ ప్రొఫెసర్లే. పాఠశాల విద్యాభ్యాసాన్ని ఢిల్లీలోని స్ప్రింగ్‌ డేల్స్‌లో పూర్తి చేశారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో హిస్టరీ సబ్జక్టుతో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. మరో ఆసక్తికరం అంశం ఏమిటంటే ఆమె ఒకప్పుడు కమ్యూనిస్టు. ఆమె పేరులోని ‘మర్లెనా’ మార్క్సిస్టుల నుంచి తీసుకున్నారు. 

    2013లో ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో మొదట ఆమె కార్యకర్త. పార్టీలో చురుగ్గా పని చేసేవారు. పార్టీ విధానాల రూపకల్పనలో ఆమె కీలకంగా ఉండేవారు. 2019లో ఈస్ట్‌ ఢిల్లీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కల్కాజి స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. పార్టీలో ఆమె మనీష్‌ సిసోడియా మద్ధతుదారుగా ఉన్నారు. ఆయనకు సలహాదారుగా పని చేశారు. సిసోడియా విద్యా శాఖ మంత్రిగా ఉండగా చాలా సమర్థవంతంగా పని చేశారనే పేరుంది. ఆప్‌ ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్రంలో అమలు చేసిన చక్కని విద్యా విధానం వెనుక అతిషి ఉన్నారు. ఆప్‌ రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న పరిస్థితుల్లో 2023లో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె విద్య, పీడబ్లు్యబీ, కల్చర్‌ అండ్‌ టూరిజం మంత్రిగా ఉన్నారు. 

 

Source From: delhi cm atishi