ఢిల్లీ సీఎం ఎవరో ! రేసులో ఐదుగురు కీలక నేతలు

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో ఆ పదవిని ఎవరు చేపడతారన్న ఆసక్తి నెలకొంది.


Published on: 16 Sep 2024 18:32  IST


ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్‌లో ఢిల్లీఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు.

సిసోడియా కూడా తాను ప్రజల వద్దకు వెళతానని, తిరిగి ఎన్నికైన తర్వాతే ఉన్నత పదవికి వస్తానని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి రేసులో సిసోడియా కూడా లేరని తెలుస్తోంది. ఇక ఆప్‌లోని కీలక నేతలు అతిశీ, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్ధా, కైలాశ్ గెహ్లాట్, సంజయ్ సింగ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

అతిశీ:

ముఖ్యమంత్రి రేసులో మొదటగా వినపడుతున్న పేరు అతిశీ (43). ప్రస్తుతం ఢిల్లీ ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ వంటి కీలక శాఖల మంత్రిగా ఆమె ఉన్నారు. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె ఢిల్లీలోని పాఠశాలల్లో విద్య నాణ్యతను మరింత మెరుగుపరచడానికి కృషి చేశారు. కల్కాజీకి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అవినీతి కేసులో సిసోడియా అరెస్టయిన తర్వాత అతిశీ మంత్రి అయ్యారు. కేజ్రీవాల్, సిసోడియా జైలుకు వెళ్లిన సమయంలో ఆమె పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు.


సౌరభ్ భరద్వాజ్:

గ్రేటర్ కైలాశ్ నుంచి సౌరభ్ భరద్వాజ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్,  హెల్త్ వంటి శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి నడిపిన 49 రోజుల ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానూ ఉన్నారు. ఆప్ అగ్రనేతలు జైలులో ఉన్నప్పుడు పార్టీని నడిపారన్న పేరు ఉంది.

రాఘవ్ చద్ధా:

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా రాఘవ్ చద్ధా (35) ఉన్నారు. ఆయన పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీలోని అగ్రనేతల్లో రాఘవ్ చద్ధా ఒకరు. ఆయన ఇంతకుముందు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. రాఘవ్ చద్ధా రాజిందర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2022 రాష్ట్ర ఎన్నికలలో పంజాబ్‌లో ఆప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.


కైలాశ్ గెహ్లాట్:

వృత్తిరీత్యా న్యాయవాది అయిన కైలాశ్ గెహ్లాట్(50).. ఆప్ ప్రభుత్వ సీనియర్ సభ్యులలో ఒకరు. ప్రస్తుతం రవాణా, ఆర్థిక, గృహ వ్యవహారాల శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. 2015 నుంచి ఆయన ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేసిన న్యాయవాది ఆయన. 2005-2007 మధ్య హైకోర్టు బార్ అసోసియేషన్‌లో మెంబర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.

సంజయ్ సింగ్:

ఈయన 2018 నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన వయసు 52 ఏళ్లు. సంజయ్ సింగ్ మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో రాఘవ్ చద్ధా ఒకరు. ఆప్ జాతీయ కార్యవర్గ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు. కీలక సమస్యలపై మీడియా ముందు పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేయడానికి ఆప్ ఆయననే ముందు ఉంచుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులోనూ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

Source From: delhi cm race