అత్యున్నత చదువులు చదివి.. వామపక్ష రాజకీయాల్లోకి


Published on: 13 Sep 2024 22:20  IST

ఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు  ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి. కానీ సీతారాం ఏచూరి ఆలాటి నమ్మకాన్ని ఒక నిలువెత్తు  నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. తాను  నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ అలాగే బతికారు.
విప్లవమా! అది వస్తుందో రాదో తెలియని దశలో--(ఒకప్పటి) సోవియట్ రష్యా నుంచి భారత దేశానికీ చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో  ఏచూరి కామ్రేడ్ గా మారారు; భూతలం పైన స్వర్గం (సోవియట్ రష్యా) ఒక చెదిరిన కలలా మిగిలిపోయినా.. అసలు చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్తేనా అనే అనుమానం పీడిస్తున్నా కూడా ఎర్ర జెండాను వదలకుండా వున్న ఏచూరిని చూసి  "పొద్దు తిరుగుడు పూలు" కూడా సిగ్గుపడి  తల దించుకున్నాయి.
కళ్ళ ముందే బెంగాల్ లాటి కమ్యూనిస్ట్ కంచుకోటలు కుప్పకూలినా, చట్ట సభల్లో కామ్రేడ్లు కనుమరుగవుతున్నా ఏచూరి దారి తప్పలేదు; పక్క చూపులు చూడలేదు.
చదువు సంధ్యా లేకపోతె రాజకీయాలే గతి అని అందరం అనుకుంటాం. కానీ ఏచూరి ఇందుకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. బతుకుదెరువు కోసం అయన రాజకీయాలలోకి రాలేదు. ఆలా బతకాలి అనుకుంటే ఏచూరి రాజకీయాలలోకి రావాల్సిన పనేలేదు. అందునా కమ్యూనిస్ట్ రాజకీయాలలోకి అసలే అవసరం లేదు. ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ  లో.. అందునా ఎకనామిక్స్ లో సీట్ రావడం చాలామందికి ఒక కల. ఆది దాదాపు అసాధ్యమయిన పని. అక్కడ చదివి ఐఏఎస్ అధికారి కావడమో లేకపోతె ఎదో యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ కావడమో ఏమంత కష్టమయిన పని కాదు.
కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఏచూరి ఒక సిద్ధాంతకర్త (ideologue), ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ప్రావిణ్యం వున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కాకపోతే అగ్నిహోత్రికుల కుటుంభం లో పుట్టి పెరిగిన ఏచూరి తన పార్టీలో క్రీమీలేయర్ గా, ఒక ఎలీట్ గా మిగిలిపోయారు. అందువల్ల తన టిపికల్ ఫార్మ్, ఆంగ్లిసైజెడ్ కంటెంట్  లను అధిగమించి గ్రామీణ నేపథ్యం గల మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం తనకు సవాలుగా మారింది.
జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల కూర్పులకే ఏచూరి ప్రధానంగా పరిమితం అయ్యారు. అధికార పార్టీల కూర్పులో ఏచూరి కనపర్చిన ఈజ్ మోడీ పాలనలో అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయబడి అణచివేతకు గురయిన prof సాయిబాబా, వరవర రావు లాటి వివిధ వామపక్ష పాయలకు చెందిన అనేకమందితో కలిసి పనిచేయడం లో కొరవడింది. అలాగే 20 వ శతాబ్ది లో వెల్లువలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలతో మమేకం కాలేకపోయారు. బహుశా తన సామజిక నేపథ్యం కూడా ఇందుకు అడ్డంకి అయివుండొచ్చు.
At a time when the communist  parties of all shades have been fast turning into a Sahara of Intellectuals, his demise is a great loss. మార్క్సిస్ట్ సిద్ధాంతం ఒక డాగ్మా లాగా మిగిలిపోకుండా నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడానికి అవసరమయిన థింక్ ట్యాంక్ ను పదిల పర్చడం ఏచూరి వారసుల ముందు నేడున్న అతి  పెద్ద సవాల్.

గాలి నాగరాజ 

Source From: Sitaram yechuri