బొత్సకు మళ్లీ అవకాశం వచ్చింది

రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరికీ అంతు బట్టవు. కొన్ని పదవులు ఎవరికి ఏ రకంగా వస్తాయో కూడా ఊహించడం కష్టమే. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మట్టికరిచిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అనూహ్యంగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది.


Published on: 21 Aug 2024 19:19  IST

ఎన్నికల్లో జగన్‌ పార్టీ తుడిచి పెట్టుకుపోవడంతో ఆ పార్టీలోని మహామహుల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. సమీప భవిష్యత్తుల్లో వారికి పదవులేవీ వచ్చే పరిస్థితి కనిపించలేదు. కానీ అనుకోని రీతిలో సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణకు మళ్లీ అవకాశం దక్కింది. ఆయన దశ తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉండే అవకాశం బొత్సకు లభించింది. పెద్దల సభ శాసన మండలిలో ఆయన అడుగు పెడుతున్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. 

    విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవడంతో దానికి ఎన్నిక అనివార్యమైంది. జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 80 శాతానికిపైగా వైఎస్సార్‌సీపీ వారే ఉండడంతో ఆ పార్టీకే గెలుపు అవకాశాలున్నా టీడీపీ గట్టిగా పట్టుబడితే వారంతా జంప్‌ అవడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి తన బుర్రకు పదును పెట్టి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను ప్రకటించడంతో టీడీపీకి గేట్లు మూసుకుపోయాయి. ఆయన తన రాజకీయ చతురతను ఉపయోగించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు భారీగా టీడీపీ వైపు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. మామూలుగా అయితే వారంతా టీడీపీలోకి క్యూ కట్టి ఆ శిబిరంలోకి వెళ్లిపోవాలి. కానీ బొత్స వ్యూహాలతో టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. వైఎస్సార్‌సీపీ వాళ్లను తమవైపు తిప్పకోవడానికి అసలు ప్రయత్నాలే చేయలేదు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ తమ వాళ్లనందరినీ టీడీపీకి దొరక్కుండా ప్రత్యేక క్యాంపులకు తరలించేసింది. చివరికి పోటీ పెట్టలేని పరిస్థితుల్లో టీడీపీ పక్కకు తప్పకోవడంతో బొత్స ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు.

    ఇప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష హోదా ఆయనకు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం లేళ్ల అప్పిరెడ్డి అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అది క్యాబినెట్‌ హోదా పదవి. జగన్‌ అది కావాలనే హైకోర్టుకు వెళ్లారు. జగన్‌కు లేని హోదా అప్పిరెడ్డికి దక్కింది. కానీ అప్పిరెడ్డిపై పార్టీలో ఎవరికీ సదభిప్రాయం లేదు. ఆ పదవి ఆయనకు ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో సీనియర్‌గా ఉన్న ఆయన్ను ప్రతిపక్ష నేతగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఇది ఊరటనిచ్చే విషయం. బొత్స లాంటి సీనియర్‌ మండలిలో ఉంటే టీడీపీ స్పీడుని కొంచెం తగ్గించడానికి అవకాశం ఉండవచ్చు. 
 

Source From: botsa satyanarayana