స్పీడు పెంచనున్న జగన్‌.. ఒకేసారి అభ్యర్థుల ప్రకటన

ఎన్నికల సన్నద్ధతలో ప్రత్యర్థులకు అందనంత వేగంగా దూసుకెళుతున్న జగన్‌ ఇంకా జోరు పెంచబోతున్నారా! అవుననే అంటున్నాయి వైఎస్సార్‌సీపీ కీలక వర్గాలు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఎంపిక, నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంలో దూకుడుగా ఉన్న సీఎం త్వరలో ప్రతిపక్షాలకు షాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.


Published on: 15 Feb 2024 23:58  IST

    

    అభ్యర్థుల మార్పును విడతల వారీగా ప్రకటిస్తున్న ఆయన ఇప్పటికి ఏడు జాబితాలు ప్రకటించారు. మరికొన్ని జాబితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలు ఉండడం వల్ల ఆ జాబితాలు ఆలస్యమయ్యాయి. సీటు దక్కని నేతలు టీడీపీలోకి జంప్‌ అవ్వాలని చూస్తున్నారు. కేపీ సారథి, లావు శ్రీకృష్ణదేవరాయులు, వసంత కృష్ణప్రసాద్‌ వంటి నేతలు ఇప్పటికే టీడీపీ శిబిరంలోకి వెళ్లిపోయారు. ఇలాగే మరికొంత మంది వచ్చే అవకాశం ఉండడంతో దాన్ని ఉపయోగించుకుని రాజ్యసభకు పోటీ చేయాలని చంద్రబాబు చూశారు. కానీ జగన్‌ అనూహ్యంగా అనర్హత అస్త్రాన్ని బయటకు తీయడంతో ఎవరినీ అధికారికంగా చంద్రబాబు టీడీపీలో చేర్చుకోలేదు. చేర్చుకుంటే వెంటనే వారిపై అనర్హత వేటు వేయడానికి జగన్‌ రెడీ అయిపోయారు. 

    ఆ వ్యూహం ఒక రకంగా ఫలించడంతో టీడీపీకి సరిపడా ఎమ్మెల్యేలు దొరకలేదు.     ఎమ్మెల్యేలు వెళ్లిపోతారనే సంశయంతోనే జగన్‌ కూడా అభ్యర్థుల మార్పును, కొత్త అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేశారు. ఈ నెల 20 తర్వాత రాజ్యసభ ఎన్నికల పర్వం ముగియనుంది. ఇక జగన్‌కు అడ్డు ఉండకపోవచ్చు. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ రేసు నుంచి తప్పుకోవడంతో కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు చేరినా జగన్‌ లెక్కచేయకపోవచ్చు. స్వేచ్ఛగా అభ్యర్థులను ఎంపిక చేసి వెంటనే ప్రకటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న అనంతపురంలో సిద్ధం సభ ముగిసిన తర్వాత ఒకేసారి 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లోనూ జగన్‌ అలాగే ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సింగిల్‌ సిట్టింగ్‌లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పులుస్టాప్‌ పెట్టే అవకాశం ఉంది. 
    
 

Source From: ys jagan