బీజేపీ చేతిలో ఏపీ పొలిటికల్‌ గేమ్‌

ఏపీ రాజకీయాలను బీజేపీ ఎలా క్యాష్‌ చేసుకోవాలనుకుంటోంది?. అమిత్‌షా చంద్రబాబును పిలిచి ఎన్డీఏలో చేరడానికి సిద్ధమో కాదో తెలుసుకున్నాడు. ఇంకేముంది బీజేపీతో పొత్తు కుదిరినట్లేనని టీడీపీ పరివారం తెగ సంతోషపడింది. కానీ మరుసటిరోజే ప్రధాని మోడీ, వైఎస్‌ జగన్‌ను పిలిచాడు. గంటన్నరపాటు జగన్‌తో ఆయన చర్చలు జరిపాడు. ఈ సమావేశంలోనే అమిత్‌షాతోనూ జగన్‌ చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంది? ప్రస్తుతానికి ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. బీజేపీ రాజకీయం ఎవరికీ అంతుబట్టదు. అంతు బట్టనీయదు. ఏం జరగబోతుందో కొన్ని అవకాశాలు చూద్దాం.. !!


Published on: 10 Feb 2024 22:57  IST


    బీజేపీతో కలవడం చంద్రబాబుకు అత్యంత అవసరం. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మద్ధతు లేకుండా ఎన్నికలు ఎదుర్కోలేడు. జగన్‌ను అసలే ఆపలేడు. అందుకే ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోవచ్చనేది ఆయన అంచనా. అందుకే సామదానబేద దండోపాయాలు ఉపయోగించి ఎలాగోలా అమిత్‌షాను ప్రసన్నం చేసుకున్నాడు. అసలు దగ్గరకే రానీయని అమిత్‌షా చాన్నాళ్లకి చంద్రబాబును కలిశాడు. అందులో సీఎం రమేష్‌ లాంటి వాళ్ల లాబీయింగ్‌ కూడా ఉందనుకోండి. అది వేరే విషయం. చంద్రబాబుతో కలిసి వెళ్లడం ఇష్టం లేకపోయినా కొన్ని సమీకరణల్లో తమ పార్టీకి ఫిట్‌ అవుతాడు కాబట్టి పిలిచారు. పొత్తు పెట్టుకుంటే కనీసం 6 కంటె ఎక్కువ సీట్లు కేటాయించమని అడిగే ఛాన్స్‌ ఉంది. అసలు పాయింట్‌ అది కాదు. దక్షిణాదిలోని ఏపీలో కూడా తమ ప్రాతినిథ్యం ఉందని చెప్పుకునేందుకు టీడీపీతో పొత్తును చూపిస్తారు. అన్ని రాష్ట్రాల్లో తన భాగస్వామ్యం ఉండాలనేది ఇప్పుడు బీజేపీ ప్లాన్‌. అందుకే చంద్రబాబును పిలిచారు. కానీ ఆయన్ను నమ్మడంలేదనే విషయం జగన్‌కు వెంటనే పిలుపు రావడాన్ని బట్టి అర్థమైపోయింది. దీన్నిబట్టి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా లోపాయకారీగా జగన్‌తోనూ బీజేపీ అవగాహనతో ఉంటుంది. ఇది చంద్రబాబుకు మింగుడు పడని విషయమే. కానీ తప్పదు. ఎందుకంటె అసలు లేని దాని కంటె ఎంతోకొంత నయం కదా. ఎన్నికల్లో కొంతవరకు మద్ధతు ఉంటుంది. తర్వాత కేసుల భయం ఉండదు. ఇవి చాలు చంద్రబాబుకి..

 మరో అవకాశం ఏంటంటే అసలు చంద్రబాబుతో బీజేపీ కలవకపోవడం. పూర్తిగా జగన్‌కే మద్ధతు ఇవ్వాలనుకుంటే బాబుతో పొత్తు ఉండదు. చంద్రబాబు ఏ క్షణంలో ఏ రాజకీయం చేస్తాడో తెలియదు. ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్లీ మోడీ గెలవడం ఖాయంగా కనిపిస్తుండడంతో ఇటు వచ్చాడు కానీ లేకపోతే మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు. అందుకే అమిత్‌షా బాబును నమ్మడంలేదు. అయినా తమకు ఓ అవకాశంగా బాబును చూస్తున్నారు కాబట్టి పిలిచారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆ సీట్లు తమ ఖాతాలో ఉన్నట్లే కదా.. అది వాళ్ల ఆలోచన. 

 మూడో అవకాశం జగన్‌తో కలిసి వెళ్లడం. అంటే 2019 ఎన్నికల్లో చేసినట్లే. పరోక్షంగా జగన్‌ను అన్ని వైపులా మద్ధతు ఇస్తారు. అతని గెలుపుకి అవసరమైనవన్నీ చేస్తారు. జగన్‌ బీజేపీతో టెక్నికల్‌గా ఉండడు. కానీ బీజేపీ మనిషే. జగన్‌ ఎన్ని సీట్లు గెలిచినా అవి బీజేపీకి ఉన్నట్లే. ప్రస్తుతం అదే లెక్క నడుస్తోంది. మోడీ ఏది అడిగినా జగన్‌ కాదనుకుండా చేశాడు. ప్రతిసారీ ఆయనకు మద్ధతిచ్చాడు. అదే రహస్య బంధం కొనసాగుతుంది. నేను ఎన్ని సీట్లు గెలిచినా అవి మీవే కదా అనేది జగన్‌ వాళ్లకు చెప్పే మాట. అది నిజం కూడా. ఎందుకంటె అతను వాళ్ల అనధికారి భాగస్వామి. ఇప్పటికీ ఎన్డీఏలోకి రావాలని జగన్‌ని అడుగుతున్నారు. కానీ కులాల పొందికలు, ఓట్ల సమీకరణల వల్ల అది కుదరదని అతను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. ఒకవేళ మరీ తప్పదనుకుంటే ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరే అవకాశం ఉంటుంది.

 ఓవరాల్‌గా బీజేపీ మొదటి ఆప్షన్‌కి వెళ్లే అవకాశం  ఎక్కువగా ఉంది. ఏదైనా ఒకటి, రెండురోజుల్లో తేలిపోనుంది. ఏపీ రాజకీయం ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా టీడీపీ భవితవ్యం ఆ పార్టీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. అందుకే ఆ పార్టీ శ్రేణులు అతృతగా ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. 
 

Source From: bjp