ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్‌ సాయి


Published on: 10 Dec 2023 22:58  IST

 

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్‌ సాయిని ఎంపిక చేసినట్టు ఆదివారం ప్రకటించింది. కొత్తగా విజయం సాధించిన 54 మంది ఎమ్మెల్యేలతో రాయ్‌పూర్‌లో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువరించింది. దీంతో సీఎం అభ్యర్థిపై వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. 

గిరిజనుల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర... 

నూతన సీఎం అభ్యర్థిగా ఎంపికైన విష్ణు దేవ్‌ సాయి గిరిజన వర్గానికి చెందిన నాయకుడు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టడంలో విశేష కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నిర్వహించిన నూతన ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణు దేవ్‌ సాయిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎంపిక చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 

భారీ మెజారిటీతో విజయం... 

ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ బరిలోకి దిగింది. ఇక విష్ణు దేవ్‌ సాయి కుంకూరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి 87,604 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయాలని భావించిన బీజేపీకి.. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన విష్ణుదేవ్‌సాయి సరైన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు.. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ మొదటి మంత్రి వర్గంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా, 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.

Source From: Vishnu dev sai