కాంగ్రెస్ విజయం వెనుక సునీల్ !!


Published on: 04 Dec 2023 11:51  IST

  గతంలో రాజకీయ నాయకులే యోహాను రచించుకుని అమలు చేసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వ్యూహాలు కూడా దానికి అనుగుణంగా మరింత పదునెక్కాయి. ఆ క్రమంలోనే రాజకీయ వ్యూహ కర్తలు  తెరపైకి వచ్చారు. దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ పేరొందిన విషయం తెలిసింది. తాజాగా ఆయన సరసన కొత్తగా మరో పేరు చేరింది. ఆ పేరే సునీల్ కనుగోలు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయతీరాలకు చేరుకోవడంలో సునీల్ పాత్ర కీలకమని చెబుతున్నారు. వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన కేసీఆర్ ని ఢీ కొట్టి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ కి విజయం చేకూర్చడంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కీలకంగా వ్యవహరించారు. ఎత్తులకు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన వెనుక ఉండి నడిపించారు. కర్ణాటకలో సునీల్ వ్యూహాలు పనిచేసి కాంగ్రెస్ గెలవడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

గతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలక సభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికలతో పాటు రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకూ ఆయనే స్ట్రాటజిస్ట్ గా పని చేశారు. భారత్ జూడో యాత్ర విజయవంతం అవ్వడానికి సునీల్ వ్యూహాలు కూడా తోడయ్యాయని కాంగ్రెస్ బలంగా నమ్మింది.

ఉదయపూర్ లో తీసుకున్న నవ సంకల్ప్ డిక్లరేషన్ అమలు కోసం నియమించిన టాస్క్ ఫోర్స్ 2024 బృందంలో ఆయన్ను మొదట సభ్యుడుగా కాంగ్రెస్ నియమించింది. ఆ తర్వాత ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్ గానూ నియమితులైన సునీల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్తగా పనిచేశారు. రాహుల్ గాంధీకి ప్రధాన సలహాదారుగా పేరుపొందిన సునీల్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా సహా ఇతర వ్యూహాలన్నింటినీ సునీల్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

   కాంగ్రెస్ కంటే ముందు ఆయన తమిళనాడులో ఏఐడీఎంకే, డిఎంకె పార్టీలకు వ్యూహకర్తగా పని చేశారు. 

Source From: Sunil kanugolu