అహంకారానికి తగిన గుణపాఠం

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండకపోతే ప్రజలు ఆదరించరని తెలంగాణ ఎన్నికలు రుజువు చేశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా ఎంతో ఎత్తుకు ఎదిగి అక్కడి ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్‌ తన గర్వంతో చివరికి అదే ప్రజల ఛీత్కారంతో మట్టి కరవక తప్పలేదు. మితిమీరిన అహంకారాన్ని ప్రజలు సహించలేకపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పడం కంటె బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని చెప్పడం సబబు. ఈ ఎన్నికల్లో పడిన ఓట్లు కాంగ్రెస్‌కి పాజిటివ్‌ ఓట్లు కాదు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా పడిన ఓట్లనడంలో సందేహం లేదు.


Published on: 03 Dec 2023 23:44  IST


ఉద్యమ నేత ఉద్యమాలను అణచివేశారు

    తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసేలా చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారుల అంతు చూసేదాకా వదల్లేదు. ఉద్యమ నేతగా గొప్పగా కనిపించిన కేసీఆర్‌ ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం అక్కడి ప్రజలకు నచ్చలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే దారుణంగా అణచివేయడమే కాదు కార్మికులను ఘోరంగా అవమానించారు. ధర్నాలు, ఆందోళనలపై ఉక్కుపాదం మోపారు. ప్రశ్నించిన వారిపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టారు. తనకు ఎవరు ఎదురు చెప్పినా సహించే సహనం ఆయనలో నశించింది. పరిపక్వమైన ఉద్యమ నేత.. నయా నిజంగా మారిపోయి తెలంగాణను నిరంకుశంగా పరిపాలించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 

కుటుంబ పాలనపై వ్యతిరేకత 
    
    కేసీఆర్‌ను కలిసే అవకాశం ఏమాత్రం లేకపోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. కేసీఆర్‌ మాత్రమే కాదు ఆయన కొడుకు కేటీఆర్‌ ఇతర ముఖ్య నేతలను సాధారణ ప్రజలు కలవడం దాదాపు అసాధ్యం. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, ఆయన కూతురు కవిత, ఆయన అల్లుడు హరీష్‌రావు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు చెప్పిందే వేదం. ఈ కుటుంబ పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నా మళ్లీ దొరల పాలన వచ్చిందనే అసంతృప్తి ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయింది. కేసీఆర్‌ ప్రగతి భవన్‌ను వదిలి సెక్రటేరియేట్‌కు రాకపోవడం కూడా వివాదాస్పదమైంది. తాను నిర్మించిన కొత్త సెక్రటేరియేట్‌కి సైతం రావడానికి ఆయన ఇష్ట పడలేదు. అయితే ప్రగతి భవన్‌.. లేకపోతే తన ఫామ్‌హౌస్‌కి పరిమితమవడం.. మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులంతా సెక్రటేరియేట్‌ను వదిలి కేసీఆర్‌ దర్బార్‌లోనే ఉండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన పట్టించుకోకుండా నయా నిజాంలా పాలన కొనసాగించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దొరలైతే, రాష్ట్రంలో కేసీఆర్‌ పెద్ద దొర, ఆయన కొడుకు కేటీఆర్‌ చిన్న దొరలా వ్యవహారం మారిపోయింది. ప్రజలతో వారికి సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా వారిని ఓడించాలని నిర్ణయించుకున్న ప్రజలు కసితీరా వ్యతిరేక ఓటు వేశారు. 

యువతలో తీవ్ర వ్యతిరేకత

    టీపీసీసీ పరీక్షలు ప్రహసనంగా మారడం నిరుద్యోగులు ముఖ్యంగా యువతను బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మార్చేశాయి. గ్రూప్‌–1 పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణను కుదిపేసింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడేలా లీకు వీరులు చెలరేగిపోవడాన్ని యువత సహించలేకపోయింది. ఇంత జరుగుతున్నా కేసీఆర్‌ పట్టించుకోకపోవడం యువతకు చిర్రెక్కించింది. తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతకు అవి రాకపోగా ఉన్న ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలు అస్తవ్యస్థంగా మారడం నచ్చలేదు. బర్రెలక్క ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

రాజకీయంగానూ తప్పటడుగులు

    దీనికితోడు రాజకీయంగా కేసీఆర్‌ పలు తప్పిదాలు చేశారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా వారిని మార్చలేదు. మార్చితే వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మళ్లీ వారికి సీట్లు ఇచ్చి పోటీలో నిలిపారు. కానీ ప్రజలు వారిని భరించలేమని ఓడించి కసి తీర్చుకున్నారు. ఒకవైపు ఎంఐఎంతో బహిరంగంగా స్నేహం చేస్తూ లోపాయికారీగా బీజేపీతో అవగాహన కుదుర్చుకోవడాన్ని ప్రజలు గ్రహించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేయకుండా దాగుడుమూతలు ఆడడం, బీజేపీని పరిగెత్తించిన బండి సంజయ్‌ నుంచి ఎన్నికల ముందు పార్టీ పగ్గాలు తీసివేయడం కూడా బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారాయి. బీజేపీ, కేసీఆర్‌ మధ్య సఖ్యత ఉందనే విషయాన్ని పసిగట్టిన ముస్లిం మైనారిటీలు బీఆర్‌ఎస్‌కు ఓటేయలేదు. ఎంఐఎం బలపరిచినా ఆ పార్టీకి ఓట్లేశారు తప్ప బీఆర్‌ఎస్‌ను దూరం పెట్టారు. 
    
    మరోవైపు దళితబంధు వంటి పథకాలు కొందరికే ఇవ్వడం మిగతా వారు వ్యతిరేకమవడానికి కారణమైంది. తెలంగాణ ప్రజలు తాను ఏం చెప్పినా నమ్ముతారనే కేసీఆర్‌ అతి విశ్వాసం, కనీసం ప్రజలను కలవడానికి ఇష్టపడని ఆయన మనస్తత్వం, రాజరికంలా మారిన ఆయన పాలన.. వీటన్నింటికితోడు అవినీతి పెరగడం వంటి అనేక కారణాలు కేసీఆర్‌ ఇంటి బాట పట్టడానికి కారణమయ్యాయి. 
 

Source From: kcr