3 రాష్ట్రాల్లో బిజెపి హవా.. చెక్కు చెదరని మోడీ చరిష్మా

నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కమలం  కళ్లు చెదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినా గత ఎన్నికల కంటే రెట్టింపు ఓట్లను దక్కించుకుని మెరుగైన ఫలితాలను సాధించింది.


Published on: 03 Dec 2023 14:55  IST

 

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఇంటికి 

  రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మట్టి కరవడంతో బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. 199 అసెంబ్లీ స్థానాలకుగాను 115 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అక్కడ అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ కేవలం 69 స్థానాలకే పరిమితమైంది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఎన్ని సంక్షేమ పథకాలు, ప్రజాకర్షణ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. ఐదేళ్లకు ఓసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం ఉన్న రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి అధికారం బదిలీ అయింది.

మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ

 మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. 230 స్థానాలకు గాను 163 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌ 66 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ దాన్ని అక్కడ నిలబెట్టుకోగలిగింది. జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ బలం పెరిగింది.

చత్తీస్‌ఘడ్‌లో బీజేపీ జోరు
    చత్తీస్‌ఘడ్‌లోనూ బీజేపీ విజయ ఢంకా మోగించింది. 99 స్థానాలకు గాను బిజెపి 54 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ 35 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఊదరగొట్టినా చివరికి బీజేపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది.

తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు 

   తెలంగాణ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే బీజేపీ పరిమితమైనా ఓటు బ్యాంకును మాత్రం గణనీయంగా పెంచుకోగలిగింది. 2018 ఎన్నికల్లో కేవలం ఏడు శాతం ఓట్లే రాబట్టిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 13.5 శాతం ఓట్లు సాధించింది. రెట్టింపు ఓట్లు సాధించడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ భవిష్యత్తు రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.

  మొత్తంగా నాలుగు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ జోరు స్పష్టమైంది. ప్రధానమంత్రి మోడీ చరిష్మా చెక్కు చెదరలేదని ఈ ఫలితాలు నిరూపించాయి. గెలిచిన మూడు రాష్ట్రాలకు సీఎం అభ్యర్థులను ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగి గెలవగలిగింది. 
 

Source From: Bjp