కాంగ్రెస్‌ చేతికి తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. 119 స్థానాలకుగాను 64 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బిజెపి 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, సిపిఐ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య రెండు శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది. బీఆర్‌ఎస్‌ కంటె కాంగ్రెస్‌కి 2.5 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి.


Published on: 03 Dec 2023 14:11  IST


గ్రామీణ ప్రాంతాల్లో హస్తం హవా


     ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 60 స్థానాల కంటే నాలుగు స్థానాలను అదనంగా కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంది.   తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవగా, ఒక స్థానంలో ఆ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ కేవలం ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 11 సీట్లను కాంగ్రెస్, ఒక సీటును మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ 12 సీట్లను కాంగ్రెస్, రెండు సీట్లను బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కరీంనగర్‌ జిల్లాలో 8 కాంగ్రెస్, 4 సీట్లలో బీఆర్‌ఎస్‌ గెలిచింది. అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ చెరో 4 స్థానాల్లో గెలుపొందగా బీఆర్‌ఎస్‌ 2 సీట్లలోనే గెలిచింది. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ 4, బీజేపీ 3, బీఆర్‌ఎస్‌ 2 సీట్లను గెలుచుకుంది. వరంగల్‌ రూరల్‌లో 10 సీట్లలో కాంగ్రెస్, 2 సీట్లలో బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. 

 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పట్టు

    గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం బిఆర్‌ఎస్‌ ఆధిక్యం నిలబెట్టుకుంది. ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలో 7 స్థానాలను బీఆర్‌ఎస్, మరో 7 స్థానాలను ఎంఐఎం, ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నాయి. అక్కడ కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా రాలేదు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఈసారి కూడా తన పట్టు నిలుపుకుంది. మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ స్థానాలు, కాంగ్రెస్‌ 3 స్థానాలు దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లాలో 10 స్థానాలను బీఆర్‌ఎస్, 4 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు చతికిలబడ్డారు.

తొలిసారి అధికారంలోకి కాంగ్రెస్‌

    తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా దెబ్బతింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్‌ క్రెడిట్‌ను సొంతం చేసుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. కానీ మూడోసారి మాత్రం ఆయన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నుకోనుంది. 

పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతం
కాంగ్రెస్‌         : 39.40 శాతం
బీఆర్‌ఎస్‌        : 37.35 శాతం
బీజేపీ            : 13.90 శాతం
ఎంఐఎం        : 2.222 శాతం
బీఆఎస్‌పీ       : 1.37 శాతం
సీపీఐ              : 0.34 శాతం
సీపీఎం           : 0.22 శాతం
నోటా               : 0.73 శాతం
ఇతరులు        : 3.84 శాతం

 

Source From: Ts elections