విశాఖ మిలీనియం టవర్స్ లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలు


Published on: 23 Nov 2023 19:48  IST



ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలకు సంబంధించి స్థలాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కమిటీ నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని తెలిపారు. ఇక వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు.

Source From: Ap capital vyzag