బాబు అరెస్టుపై జూనియర్‌ మౌనం.. దేనికి సంకేతం!

మామయ్య చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉన్నా జూనియర్‌ ఎన్టీఆర్‌ నోరు మెదపలేదు. అరెస్టును ఎందుకు ఖండించలేదు. ఇందులో జూనియర్‌ వ్యూహం వుందా?


Published on: 07 Oct 2023 15:25  IST

చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉండడంతో రాష్ట్రం దిక్కులేని అనాధలా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ అదే పనిగా శోకండాలు పెడుతోంది. ఆయన పెంచి పోషించిన మీడియా చేస్తున్న హడావుడి చూస్తే ఆంధ్రాలో ప్రపంచ యుద్ధమే జరుగుతుందనే భ్రమ పడక తప్పదు. నందమూరి, నారా కుటుంబాలు ఏం చేయాలో పాలుపోకవిలవిల్లాడిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్‌ కుటుంబం ఎప్పుడూ చూడని అనుభవమిది. ఇంత జరుగుతున్నా అదే కుటుంబానికి చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం నోరు విప్పకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మామయ్య అరెస్టయినా తనకేమీ పట్టనట్లు జూనియర్‌ ఎన్టీఆర్‌ షూటింగుల్లో నిమగ్నమైపోయాడు. దీన్ని చూసి టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. జూనియర్‌పై సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడుతున్నారు. బాలకృష్ణ కూడా తట్టుకోలేక జూనియర్‌ స్పందించకపోయినా ‘ఐ డోంట్‌ కేర్‌’ అని బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

చంద్రబాబు అరెస్టును ఎందుకు ఖండించలేదు?
    ఇంతకీ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నాడు? చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడానికి కారణం ఏమిటి? జూనియర్, నందమూరి కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు స్వయంకృతాపరాధమే దీనికి కారణమని చెప్పక తప్పదు. అవకాశవాద వైఖరితో జాతీయ స్థాయిలో రాజకీయంగా ఒంటరైన చంద్రబాబు.. కుటుంబంలోనూ అందరివాడు కాలేకపోయారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను చాలాకాలం నుంచి చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ వ్యతిరేకిస్తున్నారు. అతన్ని చేరదీస్తే లోకేష్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే భయం చంద్రబాబులో ఉందన్నది నిజం. లోకేష్‌ కూడా జూనియర్‌ను ఎదగనివ్వకూడదనే ఆలోచనతో అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టాడు. అతని సినిమాలకు అడ్డంకులు కల్పించాడు. బాలకృష్ణ కూడా ఇందుకు సహకరించాడు. చంద్రబాబు తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితేనే తెలుగుదేశం పార్టీని నడపగలడనే అభిప్రాయం ప్రజల్లో ఉండడంతో ఆయన్ను ఇంకా తొక్కాలని చూశారు. కానీ జూనియర్‌ అవేమీ పట్టించుకోలేదు. నందమూరి కుటుంబ కార్యక్రమాలకు పిలవకుండా అవమానించినా భరించాడు. తను వెళ్లిన కార్యక్రమాల్లోనూ అందరి ముందు చిన్నచూపు చూసినా మౌనంగా వచ్చేశాడు. తారకరత్న చనిపోయినప్పుడు జరిగిన కుటుంబ కార్యక్రమాల్లోనూ జూనియర్‌ను బాలకృష్ణ సహా మిగిలిన కుటుంబ సభ్యలు అవమానించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తనను ఎంత అవమానించినా జూనియర్‌ మాత్రం హుందాగానే వ్యవహరించాడు. తన తండ్రి హరికృష్ణ కుటుంబంతో మాత్రమే దగ్గరగా ఉంటూ వారిలో కలిసిపోయాడు. చంద్రబాబు, బాలకృష్ణలు అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు. 

జూనియర్‌ది వ్యూహాత్మక మౌనం 
    ఈ నేపథ్యంలో జరిగిన చంద్రబాబు అరెస్టును ఆయన ఖండించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? తమకు అవసరం లేనప్పుడు ఈసడించుకుని ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని గగ్గోలు పెట్టడం ఏమిటని జూనియర్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ విషయంలో జూనియర్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. జూనియర్‌కు ఇప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అవకాశం వస్తే మాత్రం వదిలేది లేదని చెప్పకనే చెబుతున్నాడు. చంద్రబాబు సభల్లోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీలోకి రావాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేస్తున్న అభిమానులను జూనియర్‌ ఎప్పుడూ వారించలేదు. అతనికి కచ్చితంగా రాజకీయ వ్యూహాలున్నాయి. అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. చంద్రబాబు ఉన్నంత వరకు ఇటువైపు చూడకపోవచ్చు. కానీ రాజకీయంగా తనకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాడు. టీడీపీలోనే చాలామంది జూనియర్‌ అయితేనే పార్టీ నిలబడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ తెలుసు కనుకే జూనియర్‌ ఇప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టకుండా నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తున్నాడు. చంద్రబాబు అరెస్టయినా పట్టించుకోకపోవడానికి కారణం ఇదే. తనను పట్టించుకోని వారిని తాను పట్టించుకోననే రీతిలో తని పని తాను చేసుకుపోతున్నాడు. ఇది కచ్చితంగా చంద్రబాబుకు, లోకేష్‌కు ఒకరకంగా వార్నింగ్‌ లాంటిదే?

 

Source From: Junior ntr silence about cbn arrest