‘జనవాణి’లో పవన్‌కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు

జనసేన అధినేతకు అస్వస్థత.. ఈ వార్త అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. తమ అభిమాన హీరో, అభిమాన నాయకుడు అనారోగ్యానికి గురి కావడం అనే మాట విని తట్టుకోలేకపోతున్నారు. ప్రజల కోసం పాటు పడే మనిషికి ఇలా ఆరోగ్య సమస్యలు రావడం పట్ల అభిమానులు ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు.


Published on: 03 Oct 2023 19:31  IST

విషయం ఏమిటంటే... వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్‌ మంగళవారం కృష్ణాజిల్లాలోని మచిలీ పట్నంలో పర్యటిస్తున్నారు. ఈ విజయయాత్రలో ప్రత్యేకంగా జనవాణి అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు. ఇందులో కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కానివి వుంటాయి. వాటిని ఫిర్యాదులుగా జనవాణి కార్యక్రమంలో తీసుకుంటారు పవన్‌కళ్యాణ్‌. మంగళవారం ఇదే కార్యక్రమంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్న సమయంలో పవన్‌కు వెన్నునొప్పి వచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని భావించినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే పవన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

 

అప్పుడప్పుడు పవన్‌కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టే ఈ వెన్నునొప్పి ఇప్పటిది కాదు. గబ్బర్‌సింగ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ టైమ్‌లో వెన్నుపూసలకు గాయమైంది. దానికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు తనను ఇబ్బంది పెడుతోందని 2019లో పవన్‌ ఓ సందర్భంలో ప్రకటించారు. దానికి శస్త్ర చికిత్స అనివార్యమని డాక్టర్లు చెప్పినప్పటికీ సంప్రదాయ పద్ధతిలోనే చికిత్స తీసుకుంటున్నారు పవన్‌. ఇప్పుడు మళ్ళీ పవన్‌ను వెన్ను నొప్పి బాధిస్తోందన్న విషయం తెలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

Source From: Telugu Peoples