బీజేపీకి పవన్ కళ్యాణ్ రాంరాం?

బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.


Published on: 03 Oct 2023 19:25  IST

అందుకే  మిత్రిపక్షంగా ఉన్న బీజేపీతో కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా.. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంతో కలిసి వేడతానని ప్రకటించేశారు. 

 

చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ మూడ్ పూర్తిగా మారిపోయింది. జగన్ రెడ్డి సర్కార్ పై అన్ని వర్గాలలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు కూడా  రాష్ట్రంలో వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు తరువాత ఆ ఆగ్రహం అవదులనేవే లేకుండా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపుగా  సమాజంలోని అన్ని వర్గాలలోనూ జగన్ రెడ్డి పాలన అరాచకమని, వదిలిచుకు తీరాలన్న పట్టుదల కనిపించింది. ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది.  , ఏపీలో పొత్తులు ఉంటాయా? ఉంటే ఏఏ పార్టీలు కలిసి వెళ్తాయి? ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది పక్కన పెడితే.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన పొత్తు అయితే ఖరారైపోయింది. ఒక్క సారి జనసేనాని పొత్త ప్రకటన చేసిన తరువాత క్షత్ర స్థాయిలో కూడా జనసేన, తెలుగుదేశం శ్రేణులు కలిసే పని చేస్తున్నాయి.  తాజాగా పవన్ కళ్యాణ్ వారాహీ నాల్గవ విడత పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమాలలో జన సైనికులు అంతే యాక్టివ్ ఉంటున్నారు.

 

అయితే, ఎటొచ్చి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. తెలుగుదేశం, జనసేనలు బీజేపీని కూడా కలుపుకొని వెళ్తారా? లేక బీజేపీని సైడ్ చేస్తారా అన్న మీమాంస కొనసాగుతుంది. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా.. ఇప్పుడు టీడీపీతో పొత్తును ప్రకటించింది.

 

టీడీపీతో పొత్తు ప్రకటన వేళ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని, ఆ పార్టీ కూడా  కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తులు ఉండవని పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలలో రాజకీయ వర్గాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా తెలంగాణలో పొత్తులకు సమయం వచ్చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి స్టేక్ ఉంది. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడం ఇక్కడ బీజేపీకి అవసరం కూడా. ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నామని చెప్తున్న పవన్ మాత్రం అనూహ్యంగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేశారు. 

 

దీంతో తెలంగాణలో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి అనే చర్చ పెరిగిపోతోంది. పవన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు వలన టీడీపీ,జనసేన కూటమికి  ప్రయోజనం లేకపోగా..నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్న క్రమంలో  టీడీపీ, జనసేన బీజేపీకి దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు తప్ప బీజేపీఊసే ఎత్తడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణమే అధికారంలోకి వస్తుందని పదేపదే చెబుతున్నారు తప్ప బీజేపీ గురించి మాటమాత్రంగానైనా చెప్పడం లేదు. ఈ క్రమంలోనే  పవన్ కల్యాణ్   బీజేపీకి రాంరాం చెప్పేశారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీలో బీజేపీని కాదని తెలంగాణలో పొత్తుకు వెళ్తే ప్రజలలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించే పవన్ బీజేపీ నుండి దూరం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  

 

అన్నిటికీ మించి  చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందని పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధంలేదని మీడియాతో చెప్పినా అంతర్గతంగా బీజేపీ, కేంద్రం హస్తం ఉందనే  ఆయన భావిస్తున్నట్లు జనసేన వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రజలలో బీజేపీపై వ్యతిరేకత ఉందని కూడా పవన్ కళ్యాణ్  సొంతంగా నిర్వహించుకున్న సర్వేలలో తేటతెల్లమైందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ వంటి విషయాలలో కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేయడంపై పవన్ చాలా కాలంగా బీజేపీని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పుడు సమయం రావడంతో  ఆయన కమలం పార్టీకీ, కమలనాథులకు దూరం జరిగారని అంటున్నారు.  మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో   బీజేపీ పెద్దల తీరు అర్ధం కావడం వల్లనే పవన్ ఢిల్లీ కూడా వెళ్లడం లేదన్ననీ, వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

Source From: Telugu Peoples