తెలంగాణలో బీజేపీ చతికిలపడినట్లేనా.. మోడీ సభకే కొందరు సీనియర్ల గైర్హాజర్!

తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. ఓ మూడు నాలుగు నెలల కిందటి వరకూ వచ్చే ఎన్నికలలో విజయమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీ నేతలు నానా హంగామా చేశారు.


Published on: 03 Oct 2023 16:16  IST

అటు అధికార బీఆర్ఎస్ కూడా తమకు పోటీ బీజేపీయే కానీ కాంగ్రెస్ కాదు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. ఎంత సేపూ ఎన్నికల యుద్ధం బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే తప్ప కాంగ్రెస్ అసలు సోదిలోనే లేదు అన్నట్లుగా ఇరు పార్టీలూ వ్యవహరించాయి.

 

ఆ రెండు పార్టీల ఆర్భాటం, హంగామా కారణంగా కాంగ్రెస్ కు సంబంధించిన విశేషాలేమీ మీడియాలో పెద్దగా కవర్ కాలేదు. బీజేపీ, బీఆర్ఎస్ లకు అవసరమైన తీరులో కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు, సీనియర్ల అసమ్మతి రాగాలకు మాత్రం మీడియా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అంతెందుకు దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని, జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో ఎప్పుడు సాగింది, ఎప్పుడు ముగిసిందీ తెలియనంత తక్కువగా రాష్ట్రంలో మీడియా కవరేజ్ ఉందని చెప్పవచ్చు. కాగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య బంధమే ఈ పరిస్థితికి కారణమంటూ పరిశీలకులు విశ్లేషించారు. కాంగ్రెస్ సైతం అదే విమర్శలు చేసింది. 

 

అయితే ఒక్క సారిగా పరిస్థితి తల్లకిందులైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం అండగా నిలిచి అసమ్మతికి చెక్ పెట్టడంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో త్రిముఖపోటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి బాగా దిగజారిందని పరిశీలకులు ఇటీవలి విశ్లేషణల్లో కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ పోటీ ఉనికి కోసమే తప్ప విజయం కోసం కాదని తేల్చేశారు. సింగిల్ డిజట్ స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో తమ విజయం దక్షిణాదిన పార్టీకి గేట్ వేగా మారుతుందని వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో ఆ పార్టీ దయనీయ స్థితికి తాజాగా ఆదివారం (అక్టోబర్ 1) ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనే అద్ధం పడుతోందని పేర్కొంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినా పలువురు బీజేపీ సీనియర్ నాయకులు మోడీకి ముఖం చాటేశారు. ఆయన పాల్టొన్న బహిరంగ సభకు డుమ్మా కొట్టారు.  

 

బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు మహబూబ్ నగర్ లో జరిగిన మోడీ బహిరంగ సభకు గైర్హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా వీరంతా రహస్య సమావేశాలతో పార్టీని వీడే యోచన చేస్తున్నారన్న వార్తలకు మోడీ సభకు వీరి గైర్హాజర్ బలం చేకూర్చింది.  అలా గైర్హాజరైన వారిలో అత్యధికులు ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారే. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా తాము కమలం గూటికి చేరామని వీరు గతంలోనే ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో బీజేపీ పని చేస్తున్నట్లుగా కనిపించడం లేదంటూ గత కొంత కాలంగా వీరంతా పార్టీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న వారే కావడం విశేషం. వీరు బీజేపీలో ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్ న రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తాము ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతూ వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా వీకె బీర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.  

 

బీజేపీ స్వయంగా తెలంగాణలో బీఆర్ఎస్ ను గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు తాము రాష్ట్రంలో బీజేపీని గద్దె దించే సత్తా కాంగ్రెస్ కే ఉందని నమ్ముతున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ గూటికి చేరే యత్రాలు కూడా చేస్తున్నారు. రాములమ్మగా రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తాను పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన సంగతి విదితమే.  కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇంతకాలం చెబుతూ వచ్చిన అధినాయకత్వం ఆ దిశగా మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని బీజేపీలో అసమ్మతి నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా మోడీ సభనే బాయ్ కాట్ చేయడం ద్వారా తమ ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా చాటారనీ, వీరంతా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Source From: తెలంగాణ