కేసీఆర్ కుటుంబంలో మూడో తరం పొలిటికల్ ఎంట్రీ!?

కేసీఆర్ కుటుంబంలో మూడో తరం కూడా రాజకీయక్షేత్రంలో ప్రవేశించింది. ఎన్నికల వేళ ముచ్చటగా మూడో సారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంటే, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కుమారుడు అయిన కల్వకుంట్ల హిమాన్షురావు..


Published on: 03 Oct 2023 16:10  IST

రాజకీయాలలోని ఘనంగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ప్రజా వ్యతిరేకత పట్ల ఆందోళన వ్యక్తమౌతున్న తరుణంలో కల్వకుంట్ల హిమాన్షురావు ఒక ట్వీట్ తో అందరి దృష్టినీ ఆకర్షించారు. 

 

వాస్తవానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయపార్టీల కంటే ముందుగా సన్నద్ధమైన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ మాత్రమే. మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. కొత్తకొత్త పథకాలను ప్రకటించేసి.. హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి బయటపడ్డాయి.  సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రత్యర్థులకు అందని వేగంతో వ్యూహాలు రచించడంలోనూ మేటిగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎత్తుగడలు పారడం లేదు. వ్యూహాలు ఫలించడం లేదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. అటువంటి వేళ ఆయన వైరల్ ఫీవర్ తో గత పది రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. తన నివాసంలోనే వైద్యుల బృందం పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 

 

అదలా ఉంటే.. మోడీ తెలంగాణ పర్యటనతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించేసింది. జనం నమ్ముతారా? నమ్మరా అన్న విషయంతో పని లేకుండా గత ఎన్నికల ముంగిట ఇచ్చి అమలు చేయని పసుపుబోర్డు హామీని మరోసారి ఈ ఎన్నికల ముంగిట మోడీ ప్రకటించేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా రాష్ట్రంలో ఒక బలీయమైన రాజకీయ శక్తిగా మారింది. గెలుపు ధీమాతో ముందుకు సాగుతోంది. ఆ పార్టీకి సహజ లక్షణం అని అంతా చెప్పుకునే గ్రూపు విభేదాలు, అసమ్మతి, అసంతృప్తి గళాలు ఈ ఎన్నికల ముంగిట పెద్దగా కనిపించడం లేదు. ఒక వేళ అవి వినిపించినా, కనిపించినా వెంటనే అధిష్ఠానం జోక్యం చేసుకుని ఎవరి హద్దులు వారికి గట్టిగా అర్ధమయ్యేలా చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత, సమష్టితత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

 

అయితే అదే సమయంలో బీఆర్ఎస్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధినేతపైనే అసమ్మతి ఆస్త్రాలు సంధిస్తోంది. అదే సమయంలో గతంలోలా కేసీఆర్ ఆధిపత్యం పార్టీపై పెద్దగా కనిపించడం లేదు. నేరుగా కేసీఆర్ ను విమర్శించకపోయినా, అసమ్మతులు ఆయన బుజ్జగింపులకు, హెచ్చరికలకు తలొగ్గి సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. అన్నిటికీ మించి అసమ్మతులు పిలుపు వచ్చినా ప్రగతి భవన్ కు వెళ్లేందుకు పెద్దగా సుముఖత చూపడం లేదని పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నది.  ఇటువంటి తరుణంలో కేఃసీఆర్ కుటుంబం నుంచి మూడో తరం నాయకత్వం రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తాజా ట్వీట్ ను తార్కానంగా చూపుతున్నారు.  కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు.. కానీ తాను మాత్రం తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్నాను అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షురావు ట్వీట్ చేశారు. దానికి  KCROnceAgain అనే హ్యాగ్‌ట్యాగ్‌ను  జత చేశారు. ఎన్నికల ముంగిట హిమాన్షు చేసిన ఈ  ట్వీట్ ప్రాధాన్యత  సంతరించుకుంది.

 

హిమాన్షు ఇంకా విద్యార్థే, చదువుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. అదే సమయంలో సామాజిక మాధ్యమంలో మాత్రం ఇటీవలి కాలంలో యాక్టివ్ అయ్యారు.  బీఆర్ఎస్ సర్కార్ కు, కేసీఆర్ కు అనుకూలంగా తరచూ ట్వీట్ చేస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలకు కేంద్ర బిందువుగా మారారు.  కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుడుతున్నాడు. సరిగ్గా రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంగా కేసీఆర్ వన్స్ ఎగైన్ హ్యాష్ ట్యాగ్ తో హిమాన్షు చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, అందరి దృష్టినీ ఆకర్షించింది.   వచ్చే ఎన్నికల్లో హిమాన్షురావు సామాజిక మాధ్యమం వేదికగా బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తారనడానికి ఆయన తాజా ట్వీటే తిరుగులేని ఉదామరణ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Source From: కేసీఆర్