వింటారా.! ఒక జర్నలిస్టు ఆక్రందన

‘‘నా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి. దాంతో నా పేరు నాకే అంత అవసరం లేనిదయ్యింది. అలాంటిది ఇక నా పేరుతో మీకేమి పని? మా ఊరిలో తప్ప దేశంలో నేను ఎక్కడయినా పని చేయడానికి పనికివస్తాను అన్న మా మేనేజ్మెంట్‌ జర్నలిజం వృత్తిగత ప్రాథమిక సూత్రాల ప్రకారం నా ఊరు నాది కాదు. కాబట్టి దానితో మీకు కూడా పనిలేదు. జర్నలిజం చదువుకుని ఉస్మానియా, కాకతీయ చెట్ల కింద అర కప్పుల చాయ్‌ తాగుతూ పోటీ పరీక్షలు రాసి రాసి అలసి సొలసి జర్నలిజంలోకి వచ్చానా? ఇష్టపడి జర్నలిజంలోకి వచ్చానా? వచ్చాక కష్టపడి జర్నలిజం నేర్చుకున్నానా? నేర్చుకోక కష్టపడుతున్నానా? అన్న ప్రశ్నలకు నేనిప్పుడు సమాధానాలు వెతుక్కునే స్థితిలో లేను.


Published on: 14 Aug 2024 13:38  IST


అందరూ పడుకుంటే నేను మేల్కొన్నాను. అందరూ మేల్కొంటే నేను పడుకున్నాను. అక్కడే నేను ప్రపంచానికి దూరమయ్యాను. ప్రపంచం కళ్లు తెరిపించే పనుల్లో నా కళ్లు మూసుకుపోతున్న విషయం నేను గ్రహించలేదు. గ్రహించే జ్ఞానం వచ్చేసరికి చేతులే కాకుండా మొత్తం శరీరం కాలుతోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. అలాంటిది శరీరమంతా కాలుతుంటే ఏ చెట్టూ నన్ను రక్షించలేదు. మానులుగా ఎదిగిన యజమానుల నీడలో ఇక ఏ చెట్టూ ఎదగదు. ఎదగకూడదు. పెరటి చెట్టు ఎలాగూ నా వైద్యానికి పనికిరాదు. ‘‘నాకు ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు. నేను అనంత లోక శోక భీకర తిమిరైక పతిని’’.


ఇన్నాళ్లూ ప్రపంచం బాధ నా బాధ. ఇప్పుడు నా బాధ ప్రపంచం బాధ కాకుండా పోయింది. నా ఉద్యోగం ఉంటుందో? పోతుందో? తెలియదు. జీతం నెల నెలా వస్తుందో? రాదో? తెలియదు. మా పిల్లలు పెద్దవారయ్యారు. కాలేజీలు. డొనేషన్లు. ఫీజులు. ఇంటి లోన్, వెహికిల్‌ లోన్‌ ఈఎంఐలు. అనారోగ్యాలు. ఆసుపత్రుల ఖర్చులు. అంతా అగమ్యగోచరంగా ఉంది. నేను జర్నలిస్టును కాకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు నన్ను నేను రద్దు చేసుకుంటున్నాను. నేను మనిషిగా మిగిలి ఉండడానికి దారులు వెతుక్కుంటున్నాను. నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తప్ప నాకిప్పుడు ఏ ఆదర్శాలూ లేవు. ఉన్నా నాకవసరం లేదు.


ఉసురు తగిలి పోతారని తెలుగులో చేతకానివారు అనుకోవాల్సిన చేతకాని మాట. మా మనసులో మౌనంగా తిట్టుకున్నా దాన్ని అక్షరాల్లోకి అన్వయించే నిగూఢ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ మీదగ్గరుందన్న ఎరుక మాకుంది. కాబట్టి స్వగతంలో కూడా కసితీరా తిట్టుకోలేని దీనులం. పేద జర్నలిస్టు కోపం పదవికి చేటు.

అక్షరం అంటే నాశనం లేనిది అని చాలా లోతయిన అర్థమేదో ఉన్నట్లుంది. మేము క్షయమవుతూ మేము రాసే అక్షరం మాత్రం క్షయం కాకుండా ఉండడం ప్రకృతి సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? అయినా నోట మాట లేని నిర్‌–వచనంగా పడి ఉండాల్సిన వాళ్లం. మాటల నిర్వచనాలు మాకెందుకు?

నేను ఎన్నో వార్తలు రాశాను. హెడ్డింగులు పెట్టాను. అనువాదాలు చేశాను. ఎడిటింగులు చేశాను. సంపాదకీయాలు కూడా రాశాను. నా వార్త ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. నా వార్తకు శీర్షిక లేదు. ముగింపు ఉందో లేదో తెలియదు. ఎలా అనువదించుకోవాలో అంతుపట్టడం లేదు. నా జీతం.. ఎడిటింగ్‌ ఒక్కటే గుర్తొస్తోంది. నెల సంపాదన లేకుంటే సంపాదకీయం ఎలా రాయగలను?

లోకంలో ఎన్నెన్నో బాధలకు, కన్నీళ్లకే కన్నీళ్లు, కళ్లల్లో రక్తం వచ్చేలా రాశాను. నేను చలించి, గుండె బరువెక్కి రాసిన ఏయే విషాదాలు నాకిప్పుడు అన్వయం అవుతాయో నాకే తెలియడం లేదు.

ఇప్పుడు నామీద నేనే రాసుకోలేని, నాకు నేనే అర్థంకాని ఒకానొక వార్తను. 

 

- ((ఒక డెస్కు జర్నలిస్టు ఆవేదనతో తన మీద తానే రాసుకున్న ఒక న్యూస్‌))

 

 

Source From: journalist