ఐపీఎస్‌కి ఎంపికైన ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ కొడుకు

అతని తండ్రి ఒక ప్రజాప్రతినిధి. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరకు వచ్చే అధికారులను చూస్తూ పెరిగాడు. తాను కూడా వాళ్ళలా పెద్ద ఆఫీసర్‌ అవ్వాలని కలలు కన్నాడు. సివిల్‌ సర్వీసులకు ఎంపిక అవ్వడం కోసం ఏడేళ్లు అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి ఐపీఎస్‌ సాధించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఎంపికైన తొలి ఐపీఎస్‌ అధికారి అతనే. పేరు కొయ్యే చిట్టిరాజు. తండ్రి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు. ఆయన చిన్న కుమారుడు చిట్టిరాజు.


Published on: 01 Aug 2024 14:30  IST

  చిన్నప్పటి నుంచి తండ్రి ప్రజలకు దగ్గరగా ఉండడాన్ని చూసిన చిట్టిరాజు తాను పెద్దయ్యాక ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండాలనుకునేవాడు. కొందరు అధికారుల పనితీరును చూసి తన దారి సివిల్‌ సర్వీసులేనని నిర్ణయించుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా పని చేసిన లవ్‌ అగర్వాల్, ఆ జిల్లా నుంచి ఐఏఎస్‌గా ఎదిగిన రేవు ముత్యాలరాజులను స్పూర్తిగా తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలో రాలేదు. రెండు, మూడు ప్రయత్నాల్లోనూ నిరాశే ఎదురైంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరికి ఆరో ప్రయత్నంలో విజయం సాధించాడు. తాజాగా ఆగస్టు 26న ముస్సోరీలో ఐపీఎస్‌ శిక్షణకు రావాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉత్తర్వులిచ్చింది.


    చిట్టిరాజు పదో తరగతి వరకు భీమవరంలోనే చదువుకున్నాడు. ఇంటర్మీడియట్‌ విజయవాడలోని శ్రీ చైతన్యలో పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్‌ చేశాడు. బీటెక్‌ పూర్తయ్యాక చెన్నైలోని ఇన్ఫోసిస్‌ కంపెనీలో రెండున్నరేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం. అది బోర్‌ కొట్టడంతో జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనే కోరికతో 2018–19లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటి నుంచి సివిల్‌ సర్వీసు పరీక్షల కోసం సన్నద్ధమయ్యాడు. ఢిల్లీలోని వాజిరామ్, రవి సివిల్స్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకున్నాడు. ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించాడు.

    విజేత ఐఏఎస్‌ అకాడమీ మెంటర్‌ కిషోర్‌ తనకు అందించిన సహకారం మరువలేనిదని చిట్టిరాజు చెబుతారు. ఆయన ప్రిపరేషన్‌లో మెళకువలు నేర్పించారు. పెద్ద ఉద్యోగం, హోదా అనేవీ ఏమీ చూడకుండా సివిల్‌ సర్వీసుల ద్వారా సమాజానికి, ప్రజలకు ఎలా మేలు చేయాలనే కోణంలో ఆలోచించాలని చిట్టిరాజు సివిల్స్‌ విద్యార్థులకు సలహా ఇస్తాడు. పబ్లిక్‌ సర్వీసెస్‌ పట్ల మక్కువ ఉంటే దేశంలో అత్యున్నతమైన సివిల్‌ సర్వీసుల లక్ష్యాన్ని అందుకోగలమనేది అతని అభిప్రాయం.

Source From: Ips