పైరవీ పవర్‌ : డీటీపీ ఆపరేటర్‌ మంత్రి పీఎస్‌ అయిపోయాడు

అధికారంలోకి రాగానే ప్రాధామ్యాలు మారిపోవడం మామూలే. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఇవి చాలా విచిత్రంగా ఉంటున్నాయి. పైరవీలు చేసి మంచి పోస్టుల్లో తిష్ట వేసే ఉద్యోగులు, అధికారులను చాలా చోట్ల చూస్తాం.. కానీ ఏపీ గనుల శాఖలో అవుట్‌సోర్సింగ్‌లో పని చేసే చిరుద్యోగి ఏకంగా రాష్ట్ర మంత్రి పీఎస్‌ పోస్టు కొట్టేశాడు. ప్రభుత్వ ఉద్యోగి కాకపోయినా, అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తూ ఒక ఐఆర్‌ఎస్‌ అధికారి అండతో ఏకంగా మంత్రి పేషీలోనే కీలకమైన పోస్టులో చేరిపోయాడు. పైరవీకారుల హవా ఎలా ఉంటుందో తెలియజెప్పే ఉదాహరణ ఇది. పూర్తి కథనం చదవండి


Published on: 30 Jul 2024 21:43  IST

Survey Stone Application
                                                                                                                       

    విజయవాడ ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ) ఆఫీసులో డీటీపీ ఆపరేటర్‌గా (జూనియర్‌ అసిస్టెంట్‌) అవుటసోర్సింగ్‌ విధానంలో దినేష్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. 2014–19లో డీటీపీ ఆపరేటర్‌గా ఉంటూనే అప్పటి ఎండీ వెంకయ్య చౌదరికి  నమ్మకస్తుడిగా మారడంతో ఆయన తన సీసీగా పెట్టుకున్నాడు. చిత్రం ఏమిటంటే అతనితోపాటు అతని భార్య శ్వేత, సోదరుడు దినకర్‌ కూడా ఏపీఎండీసీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే. ఒకే కుటుంబంలోని ముగ్గురికి.. ఒకే ప్రభుత్వ శాఖలో.. ఒకే చోట మూడు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు.. మామూలు వ్యక్తి ఎవరికైనా ఇలా కుదురుతుందా? పైరవీల్లో దిట్ట అయితే తప్ప ఇలాంటి ఆఫర్‌ ఎవరికీ రాదు. 


    ఎండీ వెంకయ్య చౌదరికి సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆయన దినేష్‌ని అప్పట్లో నెత్తిన పెట్టుకున్నాడు. అతను ఏవో ఐదు కార్లు తెచ్చి ఏపీఎండీసీలో అద్దెకు పెట్టి భారీగా బిల్లులు చేసుకున్నాడు. వెంకయ్య చౌదరిని కలవాలంటే ఎవరైనా ముందు ఇతన్నే కలిసేవారు. డబ్బు వ్యవహారాలు కూడా ఇతనే చక్కబెట్టేవాడు. అప్పట్లో దినేష్‌ది మామూలు హవా కాదు. గనుల శాఖలో సీనియర్‌ అధికారులు కూడా దినేష్‌ దగ్గర కుక్కిన పేనుల్లా ఉండేవారు. 2019లో టీడీపీ ప్రభుత్వం ఉండి వెంకయ్య చౌదరి ఉన్నంత వరకూ అతను ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో ఎండీ అన్నీ సర్దుకుని తన సొంత పోస్టు ఉన్న కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయాడు. అప్పుడు దినేష్‌ కళ్లు నేలకు దిగాయి. మంగంపేట బెరైటీస్‌ ప్రాజెక్టులో ఎక్కడో మూలన ఆపరేటర్‌గా పడేశారు. పైరవీల్లో చేయి తిరిగిన అతను ఊరుకుంటాడా? తనది పులివెందుల కావడంతో నేరుగా వెళ్లి అప్పటి సీఎం జగన్‌ తల్లి విజయమ్మను కలిశాడు. ఆమెతో ఒక ఫోన్‌ కొట్టించుకుని విజయవాడ ఏపీఎండీసీకి మార్పించుకున్నాడు. అక్కడకు వచ్చాక కూడా ఆపరేటర్‌గా సైలెంట్‌గా పనిచేశాడు.

    మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఢిల్లీ నుంచి వెంకయ్య చౌదరి తిరిగి ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చేశాడు. ఈసారి ఆయనకు టీటీడీలో కీలకమైన పోస్టు వచ్చింది. ఇంకేముంది దినేష్‌ హవా మళ్లీ మొదలైంది. వెంకయ్య చౌదరి తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టే ముందు అక్కడికి వెళ్లి అన్నీ చక్కబెట్టేశాడు. ఆయన మనసుకు నచ్చిన వాడు కదా.. వెంటనే దినేష్‌ని మళ్లీ అందలం ఎక్కించేశాడు. దినేష్‌ను మంత్రి పేషీలో అదనపు పీఎస్‌గా నియమించాలని ఆయన సిఫారసు చేశాడు. దాని కోసం మొదట ఏపీఎండీసీలో డీటీపీ ఆపరేటర్‌ పోస్టు నుంచి మేనేజర్‌గా అతని పోస్టును అప్‌గ్రేడ్‌ చేయాలి. ఆ తర్వాత మంత్రి పేషీకి డిప్యుటేషన్‌పై పంపాలి. ఆ మేరకు ఫైలు తయారు చేసి వెంటనే ఆర్డర్స్‌ ఇవ్వాలని ఏపీఎండీసీ అధికారులకు సూచనలు అందాయి. డీటీపీ ఆపరేటర్‌ను మేనేజర్‌ని చేయడం కష్టమని, అలాగే మంత్రి పేషీలో ఆ స్థాయి ఉద్యోగిని అదనపు పీఎస్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినా అది వెనక్కి తిరిగి వచ్చింది. దినేష్‌ను రూ.80 వేల జీతంతో మేనేజర్‌గా పెట్టుకుని ఆ తర్వాత డిప్యుటేషన్‌పై మంత్రి పేషీకి పంపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఏకంగా గనుల శాఖ మంత్రి దినేష్‌ను తన అదనపు పీఎస్‌గా నియమించాలని లెటర్‌ రాశారు. ఏపీఎండీసీలో ఫైలు చకచకా కదిలింది. వెంటనే అతని నియామకం జరిగిపోయింది. ఒక తాత్కాలిక ఉద్యోగి ఇప్పుడు మంత్రి పేషీలో పీఎస్‌. ఇదీ పైరవీ పవర్‌ అంటే.. 
 
                                                                                                                                           
 

Source From: apmdc