సింహంతో ఆటలా.. తిరుపతిలో జూలో వ్యక్తి మృత్యువాత

తన దగ్గరికి ఎవరైనా వస్తే సింహం ఊరుకుంటుందా! చంపి రక్తం తాగుతుంది. తెలిసి కూడా ఒక వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి మృత్యువాత పడ్డాడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలో గురువారం ఈ ఘటన జరిగింది.


Published on: 15 Feb 2024 23:15  IST

    
    తిరుపతి జూ పార్క్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. సింహం దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్‌కి చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌గా అతన్ని గుర్తించారు. 
    ప్రహ్లాద్‌ జూ సిబ్బంది కళ్లుగప్పి సింహానికి ఆహారం వేసే గేటు నుంచి దాని ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అంతే ఒక్కసారిగా సింహం అతనిపై విరుచుకుపడి ఒళ్లంతా చీరేసి రక్తం తాగింది. అతని అరుపులు విని జూ సిబ్బంది వచ్చారు. కానీ ప్రహ్లాద్‌ని రక్షించలేకపోయారు. అతి కష్టం మీద సింహాన్ని ఎన్‌క్లోజర్‌లోనే ఉన్న కేజ్‌లోకి పంపి సిబ్బంది లోనికి వెళ్లి చూస్తే అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. 
    డ్రైవర్‌గా పనిచేసే ప్రహ్లాద్‌ గుర్జర్‌ హైదరాబాద్‌లో ఉంటున్నట్లు భావిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పని చేసుకుంటున్నాడు. మూడురోజుల క్రితం అతను హైదరాబాద్‌ నుంచి బస్సులో తిరుపతి వచ్చాడు. జూ పార్క్‌లోకి అంతా తిరిగి చివరికి సింహం బోనులోకి వెళ్లి మృత్యువాతపడ్డాడు. అతను బోనులోకి ఎందుకు వెళ్లాడనే దానిపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్ధేశంతోనే సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. తప్పతాగి ఒళ్లు తెలియని స్థితిలో ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
    ప్రస్తుతం తిరుపతిలో మూడు సింహాలు ఉన్నాయి. రెండు మగ సింహాలు, ఒక ఆడ సింహం. ఒక మగ సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతో ప్రహ్లాద్‌ మృతి చెందాడు. 
 

Source From: lion attack man dead