మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు

బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన టీచర్‌ అభ్యర్థుల కల నెరవేరనుంది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ అర్హతలు, భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు 11,12లతో పాటు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించారు.


Published on: 13 Feb 2024 13:55  IST

మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు


    రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్‌ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ(గురుకులం), ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ (ఆశ్రమ్‌), ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పని చేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంతో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు.

డీఎస్సీ వయసు అర్హతలివే
డీఎస్సీ 2024లో ఎలాంటి కొత్త నిబంధనలు లేవు. 2018 డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధివిధానాలు, అర్హతలనే ఇప్పుడు అమలు చేస్తున్నారు. జనరల్‌ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 44 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్‌ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయోపరిమితి విధించారు. డీఎస్సీ ఎంపికలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు 80 శాతం, ఏపీ టెట్‌/సీటెట్‌కు 20 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌లో జరిగే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్టీ)కు రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మార్చి 15 నుంచి 30వతేదీ వరకు రెండు సెషన్స్‌లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే తేదీలను మినహాయించి షెడ్యూల్‌ ఖరారు చేశారు.
మార్చి 5వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసేందుకు వీలుగా సదుపాయాలు కల్పించారు. 

డీఎస్సీ 2024 షెడ్యూల్‌ ఇదీ
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు    : ఫిబ్రవరి 21 వరకు
దరఖాస్తులకు చివరి తేదీ    : ఫిబ్రవరి 22
ఆన్‌లైన్‌ నమూనా పరీక్ష    : ఫిబ్రవరి 24
హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌        : మార్చి 5 నుంచి
టీఆర్టీ                            : మార్చి 15 నుంచి 30 వరకు
ప్రాథమిక ‘కీ’ విడుదల       : మార్చి 31
తుది ‘కీ’ ప్రకటన              : ఏప్రిల్‌ 2
ఫలితాల ప్రకటన              : ఏప్రిల్‌ 7
 

Source From: dsc ap