నెమ్మదిగా కదులుతున్న మిగ్ చౌంగ్ తుఫాను


Published on: 04 Dec 2023 10:59  IST



బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాను నెమ్మదిగా కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల  వేగంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు అది వస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

   ప్రస్తుతానికి ఇది చెన్నయ్ కి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

సోమవారం కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య  తీవ్ర తుఫానుగా మారి తీరం దాటనుంది.

    దీని ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

సోమవారం మధ్యాహ్నం నుంచి దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం,  బాపట్ల కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అవి ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఈ తుఫాను ప్రభావంతో మంగళవారం నుంచి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిచోట్ల ఆకస్మికంగా వరదలు వచ్చే సూచనలు కూడా ఉన్నట్లు తెలిపింది. 100 కిలోమీటర్ల వేగంతో విజయదుర్గాలులకు చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Source From: Mig choung cyclone