ఎర్ర చందనం.. భూమిపై పెరిగే బంగారం

ఎర్ర చందనం.. దీనికి చైనాలో ఉన్న డిమాండ్‌ తెలిస్తే ఔరా అనాల్సిందే. ఎర్ర చెక్కతో చేసిన ఫర్నీచర్‌ను చైనీయులు ఎంత ఖర్చయినా కొని ఇంట్లో పెట్టుకుని అపురూపంగా చూసుకుంటారు. అక్కడ టన్ను ఎర్ర చందనం రేటు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయలకు పైనే పలుకుతుంది. కానీ ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకదు. కేవలం ఏపీలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం పెరుగుతుంది. అందుకే స్మగ్లర్లు ఎంతకు తెగించైనా ఎర్ర చందనాన్ని అక్రమంగా నరికి ఎగుమతి చేస్తున్నారు. పుష్పా సినిమాలో చూశారు కదా..


Published on: 04 Nov 2023 21:26  IST

చైనా రెడ్‌ శాండల్‌వుడ్‌ మ్యూజియంలో లక్షల కోట్ల సంపద

    1999లో తొలిసారి బీజింగ్‌లోని చైనా రెడ్‌ శాండల్‌వుడ్‌ మ్యూజియాన్ని ప్రజల సందర్శనం కోసం తెరిచారు. అందులో కళ్లు తిప్పుకోనివ్వని అద్భుతమైన కళాకృతులున్నాయి. అన్నీ ఎర్ర చందనంతో చేసినవే. హన్, మింగ్, క్వింగ్‌ వంశీకుల రాజ ప్రసాదాల నుంచి సేకరించిన లక్షల కోట్ల సంపద అది. చైనా రాజులు, చక్రవర్తులకి ఎర్ర చందనంతో చేసిన కళాకృతులు, ఫర్నీచర్‌ అంటే ఎంతో మక్కువ. రూయీ కళాకృతిలో చేసిన వాటిని తమ వద్ద ఉంచుకుంటే అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తారు. కూర్చునే సింహాసనం, పడుకునే మంచం ఏదైనా ఎర్ర చందనంతో తయారైందే కావాలనుకునేవారు. తమ దేశంలో పెరిగే ఎర్ర చందనం చెట్లన్నీ అంతరించిపోవడంతో అవి దొరికే మన దేశంలోని శేషాచలం అడవులపై వారి దృష్టి పడింది. కొన్ని వేల సంవత్సరాల నుంచే ఎంత ఖర్చుకైనా, కష్ట నష్టాలకైనా వెనుకాడకుండా ఆ కలపను సేకరించేవారు. అప్పటి నుంచి మన ఎర్ర చందనం చైనాకి చేరుకుని అక్కడ కోటల్లో అందంగా కొలువు తీరింది. ధృడంగా, మృదువుగా ఉండే ఈ కలప కళారూపాలు చెక్కడానికి, ఫర్నీచర్‌ చేయడానికి అనువుగా ఉంటుంది. రాజులు తమ కోటల్లో పెట్టుకోవడానికి ఈ చెక్కను అనుమతించేవారు. ప్రజలు దీన్ని వినియోగించడంపై నిషేధం విధించారు. రాజుల కాలం పోయిన తర్వాత ఆంక్షలు తొలగి బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రాజుల మోజు అక్కడి ప్రజలకు వచ్చింది. అందుకే ఎంత రేటుకైనా ఆ ఫర్నీచర్, గృహాలంకరణ వస్తువులను కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డారు. 

చెక్క ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం

    ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండడంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే ఏపీ ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది. శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్లలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్న చోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకిగానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలిభాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకి ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి. ఆ నేలలో ఉండే క్వార్ట్‌జ్‌ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

‘ఏ’ గ్రేడ్‌ అయితే పంట పండినట్లే 

    అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ఎర్ర చెక్క సి గ్రేడ్‌ అయితే రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్‌ చెక్కయితే రూ.75 నుంచి కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ రేటుకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు. జపాన్, మయన్మార్‌ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్‌ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి మరీ శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకి చైనా వంటి దేశాలకు అమ్ముతారు. 

 

Source From: red sanders