ఒక్కరోజులో ఆవిరైపోయిన ఎలాన్ మస్క్ రూ. 1.30 లక్షల కోట్ల సంపద

ఎలాన్ మస్క్ కి ఒక్క రోజులోనే ఊహించని విధంగా భారీ నష్టం వాటిల్లింది. టెస్లా షేర్ల విలువ పడిపోవడంతో ఆయన ఆస్తి ఒక్కరోజులోనే కోటి 30 లక్షల కోట్లు కరిగిపోయింది.


Published on: 20 Oct 2023 13:15  IST

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు భారీ నష్టం ఎదురైంది. ఆయన సంపద ఏకంగా రూ.1.30 లక్షల కోట్లు ఒక్కరోజులో ఆవిరైపోయింది. టెస్లా షేర్ల పతనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో గురువారం కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఒక్కసారిగా మస్క్‌కు భారీ నష్టం ఎదురైంది. నష్టం ఎదురైనప్పటికీ.. బ్లూమ్బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 210 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మస్క్‌ కొనసాగుతున్నారు. ఈ ఏడాది మస్క్‌ సంపద ఇప్పటి వరకు 70 బిలియన్‌ డాలర్లు పెరిగింది. 

టెస్లా షేర్లు గురువారం ఏకంగా 9.3 శాతం నష్టపోయి 220.11 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. మస్క్‌కు ఈ కంపెనీలో 13 శాతం వాటాలు ఉన్నాయి. ఆయన సంపదలో అత్యధిక భాగం టెస్లా షేర్లదే. ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు టెస్లా గత కొన్ని నెలల్లో కార్ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం కూడా విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో టెస్లా షేర్లలో పతనం నమోదైంది. అయితే.. ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను డెలివరీ చేసి తీరతామని టెస్లా తెలిపింది. మరోవైపు నవంబరులో టెస్లా తమ సైబర్‌ ట్రక్‌ను విడుదల చేసే యోచనలో ఉంది.

Source From: Elon musk