మేళతాళాలతో ధూంధాంగా విడాకుల ఊరేగింపు

భర్త నుంచి విడిపోవాలనుకున్న తన కూతురిని ఒక తండ్రి భారీ ఊరేగింపుతో తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు. అచ్చం పెళ్లి వేడు వేడుకలానే విడాకుల ఊరేగింపు నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు


Published on: 18 Oct 2023 23:05  IST

పెళ్లయిన ఏడాదికే కన్న కూతురు విడాకులు తీసుకుంటానంటే.. ఆమె తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోతాయి. సమాజం ఏమనుకుంటుందో అని భయపడిపోతారు. కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో కష్టమో, న ష్టమో భర్తతోనే సర్దుకుపొమ్మనే వారే అత్యధికం. కానీ కాపురం చేయలేనిచోట కన్నకూతురిని ఉంచలేక.. ఆమె తీసుకున్న విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తమ బిడ్డను ఇంటికి తీసుకురావడాన్ని కూడా పండగలా చేశాడో తండ్రి. బాణసంచా సందడి మధ్య ఊరేగింపుతో తన కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్‌ లోని రాంచీలో చోటుచేసుకుంది. ఈ నెల 15న జరిగిన ఈ ఊరేగింపు వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం అది తెగ వైరల్‌ అవుతోంది.

రాంచీలో నివసించే ప్రేమ్‌ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్‌ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని ప్రేమ్‌ గుప్తా చెప్పారు. సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు తెలిసిందని, అయినప్పటికీ అతడితో బంధం కొనసాగించాలనే తొలుత నిర్ణయించుకున్నానని సాక్షి పేర్కొన్నారు. కానీ, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండటం సాధ్యం కాదని అర్థమైందని వివరించారు. అందుకే వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు.


అత్తింట్లో కష్టాలు పడలేక కన్న కూతురు తీసుకున్న నిర్ణయాన్ని సాక్షి తండ్రి, ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. అంతేకాదు.. తమ కుమార్తెను తిరిగి  ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాణసంచా కాలుస్తూ  ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు. కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని ప్రేమ్‌ గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు సాక్షి. సోషల్‌ మీడియాలో ఆ తండ్రి నిర్ణయానికి శభాష్‌ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Source From: Divorce Celebraation