ఇజ్రాయిల్‌లో 18 వేల మంది భారతీయులు

ఉగ్ర దాడులతో అల్లకల్లోలంగా మారిన ఇజ్రాయిల్‌లో భారతీయులు పెద్దఎత్తున చిక్కుకుపోయారు. మన దేశం నుంచి వెళ్లిన కొందరు ప్రముఖులు కూడా అక్కడ ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.


Published on: 09 Oct 2023 13:02  IST


ఇజ్రాయిల్‌పై హమాస్‌ సంస్థ ఉగ్ర దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని 18 వేల మందికి పైగా భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  ఇజ్రాయిల్‌ కూడా ప్రతిదాడులు చేస్తుండటంతో అక్కడ పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరువైపులా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరోపక్క హమాస్‌ సంస్థ సాధారణ ప్రజలను తమ అదుపులోకి తీసుకుంటుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లోని వివిధ పట్టణాల్లో ఉన్న భారత పౌరుల గురించి ఆందోళన నెలకొంది. వారంతా ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో హైవేలపై చిక్కుకుపోయినట్లు సమాచారం. 

భారత్‌ నుంచి ఇజ్రాయిల్‌కు వెళ్లినవారిలో ఎక్కువమంది బతుకుతెరువు కోసం వెళ్లినవారే. అక్కడి వృద్ధుల సంరక్షణ కోసం పలు ఏజెన్సీల ద్వారా వందలాదిమంది అక్కడికి వెళుతుంటారు. భారత్‌ నుంచి వెళ్లిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెరుసలేంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచించింది. రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది. 

ఇజ్రాయిల్‌లో చిక్కుకుపోయినవారిలో రాజ్యసభ్య సభ్యుడు వాన్‌వేయ్‌రాయ్‌ ఖార్లుఖీ కూడా ఉన్నారు. మేఘాలయ నుంచి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కుటుంబసభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లారు. అదే క్రమంలో హమాస్‌ మిలిటెంట్లు ఆకస్మిక దాడికి దిగడంతో వారంతా బెత్లెహామ్‌లో చిక్కుకుపోయారు. ఎంపీ కుటుంబంతో పాటు మరో 24 మంది భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్పీపీ అధ్యక్షుడు కార్నాడ్‌ సంగ్మా ఎప్పటికప్పుడు వారి గురించి ఆరా తీస్తున్నారు. వీరందరినీ ఈజిప్ట్‌ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Source From: israel news