సినిమా కోర్సుకే పనిరాడన్నారు.. హాలీవుడ్‌ని శాసించాడు

సినిమా గురించి తెలిసిన వారందరికీ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ గురించి తప్పకుండా తెలుస్తుంది. జురాసిక్‌ పార్క్, హాలీవుడ్‌లో అతని రేంజే ఒక స్పెషల్‌. సుప్రసిద్ధ సినీ దర్శకుడిగా ప్రపంచమంతా ఆరాధిస్తున్న స్పీల్‌బర్గ్‌ ఒకప్పుడు సినిమా కోర్సు చేయడానికి సైతం అర్హత సాధించలేకపోయాడంటే నమ్ముతారా?


Published on: 09 Oct 2023 12:28  IST


    అమెరికాలోని ఒహోయో స్టేట్‌లో సిన్సినాటిలో 1946లో పుట్టిన స్పీల్‌బర్గ్‌కి చిన్నప్పటి నుంచి ఫిల్మ్‌ మేకింగ్‌ అంటే పిచ్చి. తన తండ్రి కెమేరాతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీసేవాడు. స్కూల్‌ చదువు పూర్తయిన తర్వాత సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ సినిమాటిక్‌ ఆర్ట్స్‌లో చదవాలనుకున్నాడు. కానీ అతని సి గ్రేడ్‌ మార్కులతో వర్సిటీలో సీటు రాలేదు. రెండోసారి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడూ రిజెక్ట్‌ అయ్యాడు. మూడోసారి కూడా అదే అనుభవం ఎదురైంది. ఇక అక్కడ సీటు రాదని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని సీటు సంపాదించాడు. అక్కడ ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించాడు. 


    అక్కడ చదువుతున్నప్పుడే అతనికి హాలీవుడ్‌లో ఉన్న యూనివర్సల్‌ స్టూడియాలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభించింది. ఇంటర్న్‌షిప్‌ చేశాక అక్కడే అంబ్లిన్‌ అనే థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం ఒక షార్ట్‌ ఫిలిం చేసే ఛాన్స్‌ వచ్చింది. కథ రాసి తన డైరెక్షన్‌తోనే 26 నిమిషాల షార్ట్‌ ఫిలిం తీశాడు. ఆ ఫిలింకి చాలా అవార్డులు రావడంతో అందరి దృష్టి స్టీవెన్‌పై పడింది. ఆ ఫిల్మ్‌ చూసిన స్టూడియో వైస్‌ ప్రెసిడెంట్‌ సిడ్నీ షిన్బెర్గ్‌ ఆశ్చర్యపోయాడు. ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వచ్చిన కుర్రాడు అంత బాగా సినిమా తీయడం అతన్ని ఆశ్చర్యపరిచింది. తన స్టూడియోలోనే ఏడేళ్లపాటు డైరెక్టర్‌గా పనిచేయడానికి అతనితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. హాలీవుడ్‌లోని ఒక పెద్ద స్టూడియోలో.. అంతగా వయసులేని కుర్రాడితో అన్నేళ్లు ఒప్పందం చేసుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయింది.     


    అక్కడి నుంచి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ హాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. జురాసిక్‌ పార్క్, జాస్, ద కలర్‌ పర్పుల్, చిండ్లర్స్‌ లిస్ట్‌ వంటి అద్భుతమైన సినిమాలు తీశాడు. నాలుగు దశాబ్దాల్లో 34 సినిమాలు మాత్రమే తీశాడు. అతను తీసినా ప్రతి సినిమా ఇంటర్నేషనల్‌ లెవల్లో సూపర్‌ హిట్‌ అయింది. మూడుసార్లు అతన్ని ఆస్కార్‌ అవార్డులు వరించాయి. అతని సినిమాల విలువ 10 వేల కోట్లు. ఒకప్పుడు సినిమాటిక్‌ కోర్సు చేయడానికే అర్హత సాధించలేని స్పీల్‌బర్గ్‌ ఆ తర్వాత హాలీవుడ్‌లోనే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ప్రపంచ సినిమా పరిశ్రమ అంతా కీర్తిస్తున్న స్పీల్‌బర్గ్‌ మొదటి అడుగు వేయడంలో విఫలమయ్యాడు. అనేక వైఫల్యాల తర్వాత విజయాల బాట పట్టి ప్రపంచంలోనే మేటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Source From: steven spielberg