ఆ ఊరి పేరే దీపావళి

అందరికీ తెలిసిన విషయం దీపావళి భారతదేశంలో అత్యంత ప్రముఖమైన హిందువుల పండుగ. కానీ ఈ పేరుతో ఒక ఊరే ఉంది ఆ విషయం మీకు తెలుసా? అది కూడా ఏపీలోనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం!


Published on: 31 Oct 2024 18:46  IST




ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది దీపావళి గ్రామం. భారతదేశం గొప్పగా జరుపుకునే పండుగల్లో ఒకటైన దీపావళి పేరును ఒక ఊరికే ఉండడం అరుదైన, వింతైన విషయం. ఇది అందమైన గ్రామమే కాదు. భారతీయ సాంప్రదాయ వేడుకలు, స్థానిక ఆచారాలు, వారసత్వానికి ప్రతీకగా ఉంది.
ఈ గ్రామానికి దీపావళి పేరు పెట్టడం వెనుక ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. గ్రామానికి శిస్తు వసూలు చేయడానికి వచ్చిన ఒక నవాబు అనుకోకుండా అక్కడ స్పృహ తప్పి అతను కోలుకునేలా చేశారు. ఆ సమయంలోనే గ్రామంలోని ప్రజలు నూనె దీపాలు వెలిగించి నవాబు కోలుకోవాలని ప్రార్థించారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన నవాబు  తనపై ఆ గ్రామం చూపిన వాత్సల్యానికి పొంగిపోయాడు. వారికి కృతజ్ఞతలు చెబుతూ మీ ఊరి పేరు ఏమిటి అని అడిగాడు. కానీ ఆ ఊరికి ఏ పేరు లేకపోవడంతో చెప్పలేకపోయారు. అప్పుడు నవాబు.. దీపాలు వెలిగించి తనను కోలుకునేలా చేశారు కాబట్టి ఈ ఊరికి దీపావళి అని పేరు పెట్టాడు. అంతేకాదు ఆ ఊరికి శిస్తు కూడా రద్దు చేశాడు. అలా ఈ గ్రామం చరిత్రలో జన్మించింది. చీకటిపై కాంతి.. చెడుపై మంచి విజయాన్ని సూచించే దీపాల పండుగ పేరుతో ఆ ఊరు అప్పటి నుంచి కళకళలాడుతూ ఉంది.

దీపావళి సందర్భంగా గ్రామం మొత్తం వేల నూనెల దీపాలతో వెలిగిపోతుంది. రంగోలీ డిజైన్‌లు వీధులు, ఇళ్లను ఎంతో అందంగా అలంకరిస్తారు. దీపావళి రోజు పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. సంప్రదాయ దుస్తులను ధరించి, నూనె దీపాలను పట్టుకుని ప్రజలంతా వీధుల గుండా తిరుగుతారు. ఈ ఊరేగింపు శ్రీ కూర్మనాధ ఆలయంలో ముగుస్తుంది.

దీపావళి గ్రామం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. గార మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరి భౌగోళిక విస్తీర్ణం 143 హెక్టార్లు. జనాభా సుమారు 1200. 500కు పైగా ఇళ్ళు ఈ గ్రామంలో ఉన్నాయి.  

Source From: Deepavali village