ఐఏఎస్ అధికారి సిసోడియా స్టైలే వేరు


Published on: 14 Sep 2024 00:46  IST

ఒక ఫోటో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా టీడీపీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రుల ఎదుట దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని డిక్టేట్ చేస్తున్నట్లు ఉన్న ఫోటో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది. ఏపీలో మంత్రుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని దాన్ని వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. ఒక అధికారి ఎదుట సీనియర్ మంత్రులందరూ చేతులు కట్టుకుని చిన్నపిల్లల మాదిరి పాఠాలు వింటున్నట్లు కూర్చోవడం నిజంగానే ఆశ్చర్యమే.

ఇటీవల విజయవాడ వరదల సందర్భంగా మంత్రుల కమిటీ సమావేశమైనప్పుడు వారితో కలిసి సిసోడియా కూర్చున్నారు. మంత్రి నారాయణ చాంబర్లో ఆయన ఒక ప్రజెంటేషన్ ఇస్తుండగా మంత్రులందరు దాన్ని ఆసక్తిగా వింటూ కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో సిసోడియా కాలు మీద కాలు వేసుకుని మంత్రులను అవమానించడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి ఆ దృశ్యాన్ని ఒక వైపు నుంచి చూస్తే అలా కనిపిస్తుంది తప్ప అందరూ ఒకే వరుసలో కూర్చున్నారని అక్కడున్న ఇతర అధికారులు చెబుతున్నారు. అయినా అలాంటి ఫోటోను చూసుకోకుండా బయటకు ఎలా విడుదల చేశారని మంత్రులు పీఆర్వోలపై విరుచుకు పడినట్లు తెలిసింది. ఈ ఫోటోను బయటకు పంపిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
అయితే బయటకు మాత్రం ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది.

    మరోవైపు ఈ వ్యవహారంపై అధికార వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో సిసోడియాకు అత్యధిక ప్రాధాన్యత దక్కిందని పలువురు అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఆయనకు ఫోకల్ పోస్టింగులు లభించలేదు. అంతకుముందు టిడిపి ప్రభుత్వంలో కూడా ఆయన మంచి పోస్టులు నిర్వహించలేదు. కానీ ఈసారి అనూహ్యంగా రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టులోకి వచ్చారు. వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేష్ ఆశించిన విధంగా వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన భూ కుంభకోణాలను బయటపెట్టే ప్రయత్నం చేసి కొంతమేర సఫలీకృతమయ్యారు. దీంతో ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి చంద్రబాబు పరిశీలిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపద్యంలో సిసోడియా వ్యవహార శైలిని తప్పుపట్టేలా, ఆయన మంత్రులను అవమానించినట్లు అనుమానం వచ్చేలా ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. 

Source From: Ias officer Sisodia