జీడిపిక్కల లారీ బోల్తా.. ఏడుగురు మృతి


Published on: 11 Sep 2024 11:43  IST


జీడిపిక్కల లోడు లారీ బోల్తా పడటంతో ఏడుగురు మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు బయలుదేరిన మినీ లారీ.. ఆరిపాటిదిబ్బలు–చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకా వారి పాకలు సమీపంలో అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకువెళ్లి తిరగబడింది. 

ప్రమాద సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులు ఉండగా, డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం తిరగబడటంతో దాని పైన ఉన్న జట్టు సభ్యులు కింద పడిపోగా, వారిపై మినీ లారీలోని జీడిపిక్కల బస్తాలు కప్పేసినట్టు పడిపోయాయి. దీంతో వాటినుంచి బయటపడలేక ఊపిరందక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందినవారిలో సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి
సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధు (తాడిమళ్ల)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Source From: Lorry accident