విజయవాడపై జలఖడ్గం.. 2.70 లక్షల మంది జలదిగ్బంధం

విజయవాడను బుడమేరు ముంచెత్తింది. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో బుడమేరు పొంగింది. దీంతో సింగ్‌నగర్‌ పరిసరాలన్నీ మునిగిపోయాయి. దాదాపు 2.70 లక్షల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.


Published on: 01 Sep 2024 23:09  IST


    నగరంలోని సింగ్‌నగర్, ఇందిరానాయక్‌నగర్, పాయకాపురం, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ, రాజీవ్‌నగర్, కండ్రిక, రామకష్ణాపురం, దేవినగర్, మధ్యకట్ట, దావుబుచ్చయ్యకాలనీ, గద్దెవారి పొలాల పరిసర ప్రాంతాలన్నీ నిటమునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. కింది అంతస్తుల్లోకి నీళ్లు వచ్చేశాయి. చాలామంది డాబాలపైకి వెళ్లి అక్కడే ఉండిపోయారు. అపార్టుమెంట్లు, రెండు, మూడు అంతస్తుల ఇళ్లు ఉంటే వాటిల్లోనే జనం చిక్కుకుపోయారు. 
    
    వరద వస్తుందనే ముందుస్తు సమాచారం లేకపోవడంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. శనివారం రాత్రి కొత్తూరు సమీపంలోని బుడమేరు గేట్లను ఎత్తివేశారు. దీంతో విజయవాడ రూరల్‌ గ్రామాలు, విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ నియోజకజవర్గాల్లోని సగం ప్రాంతం మునిగిపోయింది.

    ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యలు సరిగా అందడంలేదు. న్యూరాజరాజేశ్వరీపేట, ఇందిరానాయక్‌నగర్, నందమూరినగర్, సింగ్‌నగర్‌ ప్రాంతాలన్నీ నీట మునిగినా ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదు. దీంతో జనాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోవాల్సివచ్చింది. వారు సహాయక చర్యలు చేపట్టిన కాసేపటికి మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం, కొద్దిసేపటి తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రావడంతో వరద బాధితులకు సహాయక చర్యలను అందించలేకపోయారు.


    సింగ్‌నగర్, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా కూలి పనులు చేసుకునేవారే. అయితే వీరు ఆదివారం తెల్లవారుజామున వారి ఇళ్లల్లో తమ పిల్లలను వదిలిపెట్టి తమ తమ పనులకు వెళ్లిపోయారు. సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని తెలియడంతో వారంతా ఉరుకులు పరుగులు తీస్తూ తమ నివాసాలకు బయల్దేరారు. అయితే సీఎం బందోబస్తు పేరుతో అధికారులు తల్లిదండ్రులను అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. సాయంకాలానికి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వారిని లోపలకు వెళ్లకుండా ఆపివేశారు. దీంతో తమ పిల్లల జాడ తల్లిదండ్రులకు తెలీక.. తల్లిదండ్రుల జాడ పిల్లలకు తెలీక నరకయాతనను అనుభవించారు.

Source From: vijaywada floods