రాజ్యసభకు గల్లా, నాగబాబు !


Published on: 30 Aug 2024 22:34  IST

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేశారు..దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయినట్టు రాజ్యసభ సెక్రటేరియట్ త్వరలో ప్రకటించనుంది. అయితే ఈ పదవులపై కూటమి పార్టీల్లో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. 

అందులో టీడీపీ తరుపున గల్లా జయదేవ్, జనసేన తరపున నాగబాబు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉన్నారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో అస్త్ర సన్యాసం చేశారు. తాజాగా టిడిపి ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవడంతో ఆయన మళ్ళీ తెరపైకి వచ్చి తనకు ఏదైనా మంచి పదవి ఇవ్వాలని చంద్రబాబుని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో అది గల్లా జయదేవ్ కు కేటాయించేందుకు మార్గం సుగుమం అయిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

  మరోవైపు గత ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశం రాలేదు. మొదట ఆయన్ను అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూసిన సీట్ల సర్దుబాటులో అది బిజెపికి ఇవ్వడంతో నాగబాబుకు సీటు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చాక ఆయనకు టీటీడీ చైర్మన్ గానీ, మరేదైనా పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడం, కూటమికి ఉన్న సంఖ్యా బలం రీత్యా అవి టిడిపికి వచ్చే పరిస్థితి ఉండడంతో అందులో ఒకటి జనసేన తరఫున నాగబాబు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Source From: Rajyasabha, Galla jayadev, Nagababu