పడమటి కనుమల్లో రైలు ప్రయాణం

దేశమంతా తిరగాలి, ప్రపంచం చుట్టేయాలి అనుకునే యాత్రీకులకు బెంగళూరు నుండి హాసన్ మీదుగా మంగళూరు వరకు పడమటి కనుమల్లో చేసే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.


Published on: 27 Nov 2024 13:11  IST





నేను మంగళూరులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తరచుగా బెంగళూరు మంగళూరు మధ్య రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాణించే వాడిని. అయితే రోడ్డు మార్గం కంటే రైలులో వెళ్ళడం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. రైలు ప్రయాణాలు ఆస్వాదించేవారు తప్పకుండా ఒక్కసారైనా వెళ్లాల్సిన రూట్ ఇది.

ఈ మార్గంలో సకలేష్‌పూర్‌ నుండి ఈ సుందర దృశ్యాలు మనసుని కట్టి పడేస్తాయి. సకలేష్‌పూర్‌ కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. ఈ పట్టణం పచ్చని దుప్పటి కప్పుకున్నట్టు పచ్చదనం నిండిన చెట్లతో, కాఫీ తోటలతో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. తెలుగులో వచ్చిన వాన సినిమాకు మాతృక ఆయిన 'ముంగారుమలే' అనే సంచలన కన్నడ సినిమా షూటింగ్ మొత్తం సకలేష్‌పూర్‌ చుట్టూ పక్కన ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. వర్షాకాలంలో ఒక మూడు నెలలు విరామం లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో ఈ ప్రాంతాన్ని కన్నడలో మలేనాడు అని కూడా పిలుస్తారు. మలే అంటే వర్షం.

సుందరమైన ఈ రైలు ప్రయాణం సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉన్న సకలేష్‌పూర్‌ నుండి మొదలై గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తూ సముద్ర మట్టానికి సుమారు 110 మీటర్ల ఎత్తులో ఉన్న సుబ్రమణ్య రోడ్ స్టేషన్ వరకు కొనసాగుతుంది. పడమటి కనుమల్లో సాగే మూడు గంటల ప్రయాణంలో 55 కిలోమీటర్ల దూరం, రైలు 57 సొరంగాలు, 109 వంతెనలు మరియు 25 నీటి ప్రవాహాల గుండా వెళుతుంది. ఈ రైలు మార్గం గుండా ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైన సమయం వర్షాకాలం తర్వాత వచ్చే సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు. ఈ కాలంలో ప్రవాహాలు నిండుగా, ప్రకృతి పచ్చని చెట్లతో సజీవంగా ఉంటాయి.

సుబ్రహ్మణ్య రోడ్ స్టేషనులో దిగి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య వరకు బస్సు లేదా క్యాబ్ లో వెళ్ళవచ్చు. ఇదే కార్వర్ ఎక్స్ ప్రెస్ (16515) రైలులో మంగళూరు మీదుగా ఉడుపి, మురుడేశ్వర్, గోకర్ణ వరకు వెళ్ళవచ్చు. వీలున్నప్పుడు కుటుంబంతో ఒక ట్రిప్ ప్లాన్ చెయ్యండి.

 

__ రాజు భాయ్ దళిత్ 

Source From: Western ghats rail tour