'క' సినిమా ఎలా ఉందంటే !


Published on: 02 Nov 2024 14:24  IST

రాజావారు రాణి వారు, ఎస్సార్ కళ్యాణ మండపం మినహాయిస్తే సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్.. అసలు మామూలు డిజాస్టర్లు కావివి. రెండేళ్ల వ్యవధిలో కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన కళాఖండాలు.. కిరణ్ సినిమా అనగానే ప్రేక్షకులు లైట్ అనుకునే పరిస్థితి వచ్చేసింది.

కానీ ఇప్పుడొచ్చిన 'క' అనే కొత్త చిత్రం టీజర్ తో  గతం అంతా మరిచిపోయి ఇదేదో మంచి ప్రయత్నంలా ఉందే అనే ఆసక్తి కనబడింది.. ట్రైలర్ చూస్తే ఈసారి కిరణ్ గట్టిగానే కొట్టబోతున్నాడనే ఫీలింగ్ కలిగింది. సినిమా చూశాక అవన్నీ పైపై మెరుపులు కావని అర్థమవుతుంది. మలయాళంలో మిస్టరీ థ్రిల్లర్లను చూసి ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో ఎందుకు రావు అనుకుంటూ ఉంటాం. అందుకు సమాధానమే.. 'క'. పల్లెటూరి నేపథ్యంలో ఒక థ్రిల్లర్ కథను ఏక బిగితో చెప్పి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగారు దర్శకులు..ఎలాంటి కథను చెప్పినా విజువల్ గా కొత్తగా ఉండేలా చూసుకోవడం.. ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని పంచేలా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం ఇప్పుడున్న తాజా ట్రెండ్.

తమకు ఉన్న బడ్జెట్ పరిమితుల్లో కిరణ్ అబ్బవరం స్థాయికి తగ్గట్లే పల్లెటూరి నేపథ్యంలో ఇలాంటి వరల్డ్నే క్రియేట్ చేసుకుని నీట్ గా ఓ థ్రిల్లర్ కథను నేరేట్ చేశారు దర్శక ద్వయం.. ముందుగా కిరణ్ అబ్బవరంకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు. తాను మొదటి నుంచి చెబుతున్నట్టుగా 'క' ఒక డిఫరెంట్ జోనర్ సినిమా. కిరణ్ అబ్బవరం ఈ సినిమాని ఒక్కడే తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఇక మొదటి నుంచి చివరి వరకు తను ఈ సినిమాని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా నడిపించాడు.

ముఖ్యంగా ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఆయన ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలావరకు ప్రయత్నం చేశాడు.ఇక హీరోయిన్ తన్వి రామ్ చేసిన రాధ క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయ్. కథలో అంతర్లీనంగా ఉన్న రాధ క్యారెక్టర్ చూడ చక్కగా ఉంది. అలాగే ఈ సినిమాకి ఆమె చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి... 'ఆయ్' ఫేమ్ నయన్ సారిక మరోసారి తన క్యూట్ లుక్స్.. నటనతో ఆకట్టుకుంది.

అలాగే మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఓవరాల్ గా అందరు తమ తమ నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో ఎడిటర్ కొంతవరకు సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది.

టెక్నిక‌ల్ గా ఈ సినిమా మంచి స్థాయిలో ఉంది. కెమెరా వ‌ర్క్‌, నేప‌థ్య సంగీతం చ‌క్క‌గా కుదిరాయి.ముగింపులో 'క' లెవెల్ మారుతుంది. భిన్న నేపథ్యం.. బిగి ఉన్న కథ.. ఉత్కంఠ రేకెత్తించే కథనం.. ఆశ్చర్యపరిచే ట్విస్టులతో 'క' ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కిరణ్ అబ్బవరం చెప్పినట్లే ఈసారి కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చాడు. తన కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం అనడంలో సందేహం లేదు.

                                                  త్రినాధ్ రావు గరగ 
                                                          జర్నలిస్టు

Source From: KA movie